స్టీవ్ స్మిత్.. మళ్లీ బాదేశాడు
రాంచీ: భారత్ తో జరుగుతున్ననాలుగు టెస్టుల సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో సెంచరీ నమోదు చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో శతకం నమోదు చేసిన స్మిత్.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ సాధించాడు. మొదటి రోజు ఆటలో భాగంగా తొలి సెషన్ లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ జట్టును కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే అత్యంత బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ నమోదు చేశాడు. 227 బంతుల్లో10 ఫోర్లు సాయంతో స్మిత్ శతకం నమోదు చేశాడు. ఇది స్మిత్ కెరీర్ లో 19వ టెస్టు సెంచరీ.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 89 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ ప్రధాన ఆటగాళ్లు డేవిడ్ వార్నర్(19), రెన్ షా(44), షాన్ మార్ష్(2)లు తొలి సెషన్ లోపే పెవిలియన్ కు చేరారు. ఆ సమయంలో స్టీవ్ స్మిత్-హ్యాండ్ స్కాంబ్లు ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టారు. వీరు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు ఈ జోడి 51 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తరువాత హ్యాండ్ స్కాంబ్(19)అవుటయ్యాడు. అయితే ఆ తరుణంలో స్మిత్ కు జత కలిసిన మ్యాక్స్ వెల్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే తొలుత మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై స్మిత్ సెంచరీ చేశాడు. ఈ జోడి 120 పరుగులకు పైగా భాగస్వామ్యం సాధించడంతో ఆసీస్ తేరుకుంది. ఆసీస్ 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.