'రాంచీ'లో రెచ్చిపోతారా! | India- Australia Third Test from today | Sakshi
Sakshi News home page

'రాంచీ'లో రెచ్చిపోతారా!

Published Wed, Mar 15 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

'రాంచీ'లో  రెచ్చిపోతారా!

'రాంచీ'లో రెచ్చిపోతారా!

ఆత్మవిశ్వాసంతో భారత్‌
ఆందోళనలో ఆస్ట్రేలియా  
నేటినుంచి మూడో టెస్టు
మళ్లీ పిచ్‌ పాత్ర కీలకం
   

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లోని రెండు, మూడో టెస్టులకు మధ్య ఎనిమిది రోజుల విరామం వచ్చింది. అయితే ఆట లేకపోయినా డ్రామాకు మాత్రం లోటు లేకుండా పోయింది. డ్రెస్సింగ్‌రూమ్‌ రివ్యూపై వాదోపవాదాలు, ఫిర్యాదులు, ఉపసంహరణ, షేక్‌హ్యాండ్‌లు... ఒక్కటేమిటి ఇలా చాలా పరిణామాలు జరిగాయి. అయితే చివరకు కొట్లాట ముగించి ఇప్పుడు మళ్లీ ఆటపై దృష్టి పెట్టేందుకు ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. సిరీస్‌లో కీలకంగా మారిన మ్యాచ్‌లో తమ పూర్తి సత్తాను ప్రదర్శించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.ఐసీసీ సూచన మేరకు మ్యాచ్‌కు ముందు కెప్టెన్లు కూర్చొని నాలుగు మంచి మాటలు చెప్పుకోవచ్చు. అంత మాత్రాన సిరీస్‌లో ఆవేశకావేశాలకు లోటు లేకుండా పోతుందా!  లేక మాటల యుద్ధం ముగిసిపోయినట్లేనా. అలాంటిది ఆశించడం మాత్రం అత్యాశే కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సిరీస్‌ ఉన్న స్థితిలో ఈ మ్యాచ్‌లో ఉద్వేగభరిత క్షణాలకు లోటు లేకపోవచ్చు. ఈ మ్యాచ్‌ కోల్పోతే సిరీసే చేజారే ప్రమాదం ఉండటంతో పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగడం ఖాయం. ఇక పదే పదే చర్చల్లో నిలుస్తున్న పిచ్, రాంచీలో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.  

రాంచీ: బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ అంటేనే ఆసక్తికి లోటు లేకపోయినా... సిరీస్‌ 1–1తో సమంగా ఉన్న సమయంలో జరగబోయే మ్యాచ్‌ సహజంగానే అతి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి (గురువారం) నుంచి ఇక్కడి జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన భారత్, రెండో టెస్టులో ఘన విజయం సాధించి మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. గత మ్యాచ్‌ పరాజయం తర్వాత కోలుకునే ప్రయత్నంలో ఉన్న ఆసీస్‌ కూడా మ్యాచ్‌ కోసం బాగా సన్నద్ధమైంది. మ్యాచ్‌కు ముందురోజు రెండు జట్ల కెప్టెన్‌లు మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ను కలిశారు.

మళ్లీ మూడో స్పిన్నర్‌...
బెంగళూరు టెస్టులో ఆరంభంలో వెనుకబడిన తర్వాత కూడా కోలుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం అనంతరం వచ్చిన విమర్శలకు టీమిండియా దీనితో సమాధానం ఇచ్చింది. ప్రస్తుత సీజన్‌లో చూపించిన అద్భుత ఫామ్‌ను ఇక మిగిలిన రెండు టెస్టులలో కూడా జట్టు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కోచ్, కెప్టెన్‌ అభిప్రాయపడినట్లు పుణే టెస్టును మినహాయిస్తే మన ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తూ వచ్చారో దానిని పునరావృతం చేస్తే చాలు. దెబ్బతిని ఉన్న ఆసీస్‌కు మరో అవకాశం లేకుండా ఈ టెస్టులో పూర్తిగా దెబ్బ తీయాలని కోహ్లి సేన భావిస్తోంది. జట్టు కూర్పు విషయంలో రెండు ప్రధాన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

గాయం నుంచి కోలుకున్న ఓపెనర్‌ మురళీ విజయ్, గత మ్యాచ్‌లో ఆడిన అభినవ్‌ ముకుంద్‌ స్థానంలో జట్టులోకి వస్తాడు. ఇక్కడి పిచ్‌ కూడా స్పిన్‌కే అనుకూలమని దాదాపు ఖాయం కావడంతో మూడో స్పిన్నర్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. కరుణ్‌ నాయర్‌ స్థానంలో జయంత్‌ యాదవ్‌ రావచ్చు. నాలుగు ఇన్నింగ్స్‌లను చూస్తే భారత బ్యాటింగ్‌ తమ స్థాయికి తగినట్లుగా లేదనేది వాస్తవం. మన ఆటగాళ్లు ఎవరూ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకపోగా, మూడు అర్ధ సెంచరీలతో లోకేశ్‌ రాహుల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. పుజారా, రహానే తమ విలువేమిటో గత మ్యాచ్‌లో చూపించడంతో భారత్‌కు పెద్ద బెంగ తీరిపోయింది. ఇక ఏడాది పాటు అసాధారణ ఆటతో పరుగుల వరద పారించిన కోహ్లి రెండు టెస్టులలోనూ విఫలమయ్యాడు.

కోహ్లిలాంటి సూపర్‌ స్టార్‌ గురించి అప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా... అతను ఒక భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్లు అశ్విన్, జడేజా మరోసారి తమ మాయను చూపించేందుకు సిద్ధం కాగా... పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కూడా చెలరేగిపోతున్నాడు. అద్భుతాలు చేయకపోయినా సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ స్థానానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. భారత్‌ వంద శాతం తన ఆటను ప్రదర్శిస్తే ఈ టెస్టులోనూ తిరుగుండదు.

పలు సమస్యలు...
ప్రధాన పేసర్‌ మిషెల్‌ స్టార్క్‌ గాయంతో తప్పుకోవడంతో ఈ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బ తగిలింది. ఇది మ్యాచ్‌పై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అతని స్థానంలో కమిన్స్‌ను జట్టులోకి తీసుకున్నారు. దాదాపు ఐదున్నరేళ్ల క్రితం కెరీర్‌లో ఏకైక టెస్టు ఆడిన కమిన్స్‌... నేరుగా భారత గడ్డపై బౌలింగ్‌కు దిగి ఏ మాత్రం ప్రభావం చూపించగలడనేది ఆసక్తికరం. గాయం కారణంగానే సిరీస్‌కు దూరమైన మిషెల్‌ మార్‌‡్ష స్థానంలో మరో ఆటగాడిని ఎంచుకునేందుకు ఆసీస్‌ ముందు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ధాటిగా ఆడగల, ఆఫ్‌ స్పిన్‌ వేయగల గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు వీరందరిలో మంచి అవకాశం ఉంది. తొలి టెస్టులో అద్భుత ఆటతో సెంచరీ సాధించిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధార పడుతోంది.

గత మ్యాచ్‌లో అతను విఫలమైనా స్మిత్‌ స్థాయి ఆటగాడికి ఫామ్‌ అనేది సమస్య కాదు. అయితే ఆసీస్‌ ఎంతో నమ్ముకున్న డేవిడ్‌ వార్నర్‌ మాత్రం జట్టును నిరాశపరుస్తున్నాడు. ఇప్పటికిప్పుడు అతను అశ్విన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి పెడితే తప్ప ఆసీస్‌కు శుభారంభం లభించదు. మరో ఓపెనర్‌ రెన్‌షా చక్కగా ఆడుతుండటం ఆ జట్టుకు అనుకూలాంశం. అయితే హ్యాండ్స్‌కోంబ్‌ నుంచి కూడా జట్టు మరింత మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. ఇక రెండు టెస్టులలో అనూహ్యంగా చెలరేగి హీరోలుగా నిలిచిన స్పిన్నర్లు ఒకీఫ్, లయన్‌ మరో సంచలనం ఆశిస్తున్నారు. గొప్ప స్పిన్నర్లు కాకపోయినా పుణే తరహాలో పిచ్‌ అనుకూలిస్తే వీరిద్దరు కూడా భారత్‌ను ఇబ్బంది పెట్టగలరు. గత మ్యాచ్‌లో మంచి స్థితిలో ఉండి కూడా టెస్టు కోల్పోయిన కంగారూలు ఈసారి అలాంటి పొరపాటు చేయరాదని పట్టుదలగా ఉన్నారు.

జరిగిపోయిన వివాదం గురించి చర్చించడం అనవసరం. అదంతా ముగిసిన అధ్యాయం. రాంచీలో ఆటపై మాత్రమే మా దృష్టి. వెనక ఏం జరిగినా క్రికెట్‌కు మాత్రమే మా తొలి ప్రాధాన్యత. సుదీర్ఘ విరామంలో రాబోయే రెండు టెస్టుల గురించే మేం చర్చించాం తప్ప ఇతర అంశాల గురించి కాదు. నా గురించి చేసే ప్రతీ విమర్శకు సమాధానం ఇవ్వలేను. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నా మీద ఆరోపణలు అనేదే అసలు ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. మీడియా సమావేశంలో క్రికెట్‌ గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడగడం సంతోషకరం. మేం సుదీర్ఘ కాలంగా విరామం లేకుండా ఆడుతున్నాం కాబట్టి ఈ విరామం మాకు చాలా మేలు చేస్తుంది.
– విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌

మేం రివ్యూ కోసం పదే పదే డ్రెస్సింగ్‌ రూమ్‌ చూశామని గత మ్యాచ్‌ తర్వాత కోహ్లి చెప్పిన మాటలు అర్ధరహితం. మేం కూడా అన్ని మరచి టెస్టుపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాం. నిబంధనలకు లోబడే ఈసారి ఆటను ఆడతాం. భారత్, ఆసీస్‌ మధ్య హోరాహోరీ పోరు జరగడం ఆటకు మంచిది. సరిగ్గా చెప్పాలంటే ఫలితం ఎలా ఉన్నా క్రికెట్‌ విజేత అవుతుంది. వారితో పోలిస్తే మా స్పిన్నర్లు మెరుగ్గానే బౌలింగ్‌ చేశారని భావిస్తున్నా. పేసర్లు కూడా ఈ మ్యాచ్‌లో బాగా ఆడాలని కోరుకుంటున్నా.
– స్టీవ్‌ స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్‌ 

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌:  కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, విజయ్, పుజారా, రహానే, సాహా, నాయర్‌/ జయంత్, జడేజా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్‌.
ఆస్ట్రేలియా: స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్, రెన్‌షా, షాన్‌ , హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్‌/ స్టొయినిస్, వేడ్, ఒకీఫ్, కమిన్స్, లయన్, హాజల్‌వుడ్‌.

పిచ్, వాతావరణం
భారత్‌లో ఏ టెస్టు జరిగినా పిచ్‌ గురించి రచ్చ లేకుండా మ్యాచ్‌ ఉండదేమో. రాంచీ పిచ్‌పై కూడా ఇలాగే చర్చ కొనసాగింది. తొలి రోజు మినహా ఆ తర్వాతి నుంచి స్పిన్‌కు బాగా అనుకూలించడం ఖాయం. వికెట్‌పై పెద్దగా బౌన్స్‌ కూడా ఉండకపోవచ్చు. గత మ్యాచ్‌లాగే టాస్‌ కీలకం కానుంది. మ్యాచ్‌ జరిగే రోజుల్లో ఎలాంటి వాతావరణ సమస్య లేదు.  

800 ఆస్ట్రేలియా జట్టుకు ఇది 800వ టెస్టు మ్యాచ్‌
26 భారత్‌లో రాంచీ 26వ టెస్టు వేదిక
 ఉదయం గం. 9.30 నుంచిస్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం


స్మిత్‌ పిచ్‌ పరిశీలన

అశ్విన్, కుంబ్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement