సమం... సమం... | India, Australia teams have demonstrated equal performance | Sakshi
Sakshi News home page

సమం... సమం...

Published Sat, Mar 18 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

సమం... సమం...

సమం... సమం...

దీటుగా బదులిస్తున్న భారత్‌ 
తొలి ఇన్నింగ్స్‌లో 120/1
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 451 
ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా


 రెండో రోజు ఆటలో భారత్, ఆస్ట్రేలియా జట్లు సమ ఉజ్జీ ఆటతీరును ప్రదర్శించాయి. పిచ్‌ కాస్త టర్న్‌ అయినప్పటికీ ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అదే నిలకడ.. అదే ఏకాగ్రతను ప్రదర్శించాడు. భారత బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చూపుతూ  అజేయంగా నిలిచాడు. స్మిత్, మ్యాక్స్‌వెల్‌ కలిసి ఐదో వికెట్‌కు191 పరుగులు జోడించడంతో ఇక భారీ స్కోరు ఖాయమే అనుకున్న తరుణంలో జడేజా జట్టుకు ఆపద్బాంధవుడిలా మారాడు. తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఆసీస్‌ భరతం పట్టగా... అటు పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కూడా తన పదునైన బంతులతో ప్రత్యర్థిపై ఉచ్చు బిగించడంతో 152 పరుగులు జోడించి ఆసీస్‌ తమ చివరి ఆరు వికెట్లను కోల్పోయింది.

ఇక ఆసీస్‌కు దీటుగా భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించడంతో జట్టుకు శుభారంభం అందింది. చక్కటి స్ట్రోక్‌ప్లేతో ఆకట్టుకున్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సిరీస్‌లో తన నాలుగో అర్ధ సెంచరీని సాధించగా మురళీ విజయ్, పుజారా క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశాన్ని కల్పించారు. మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఏ స్థాయిలో ఆసీస్‌ బౌలర్లకు బదులిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారనుంది.

రాంచీ: కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గాయం కారణంగా రెండో రోజు కూడా మైదానంలో దిగకపోయినా భారత జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. రహానే నాయకత్వంలో తొందరగానే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించిన జట్టు, ఆ తర్వాత బ్యాటింగ్‌లో దీటుగా బదులిచ్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (102 బంతుల్లో 67; 9 ఫోర్లు) ఈ సిరీస్‌లో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో నాలుగో అర్ధ సెంచరీ సాధించడంతో  శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 120 పరుగులు చేసి మంచి స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్‌ (112 బంతుల్లో 42 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (10 బ్యాటింగ్‌) ఉన్నారు. ఆసీస్‌కన్నా భారత్‌ మరో 331 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు రవీంద్ర జడేజా (5/124) ధాటికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 137.3 ఓవర్లలో 451 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (361 బంతుల్లో 178 నాటౌట్‌; 17 ఫోర్లు) చివరి వరకు అజేయంగా నిలవగా మ్యాక్స్‌వెల్‌ (185 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు మూడు వికెట్లు దక్కాయి.

తొలి సెషన్‌: జడేజా జోరు
299/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆసీస్‌ ఆట ప్రారంభించగా.. తొలి బంతికే బ్యాట్‌ విరగ్గొట్టుకున్న మ్యాక్స్‌వెల్‌ చివరి బంతిని బౌండరీగా మలిచి రెండో రోజు పరుగుల ఖాతా తెరిచాడు. కొద్దిసేపటికే మరో బౌండరీతో మ్యాక్స్‌ కెరీర్‌లో తొలి సెంచరీని అందుకున్నాడు. అయితే ఈ సంతోషం ఎంతోసేపు నిలవకుండానే జడేజా వేసిన ఓ అద్భుత బంతికి తను సాహాకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 191 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు స్మిత్‌ మాత్రం ఫోర్లతో స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. వేడ్‌ (50 బంతుల్లో 37; 6 ఫోర్లు) కూడా నిలకడగా ఆడుతుండడంతో మరో మంచి భాగస్వామ్యం వైపు ఆసీస్‌ వెళ్లింది. అయితే జడేజా మరోసారి తన స్పిన్‌ సత్తాను ప్రదర్శించి మూడు బంతుల వ్యవధిలో వేడ్, కమ్మిన్స్‌ వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. వేడ్‌తో కలిసి స్మిత్‌ ఆరో వికెట్‌కు 64 పరుగులు జత చేశాడు. లంచ్‌ విరామానికి ముందు ఓవర్‌లో స్మిత్‌ 315 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు.
ఓవర్లు: 28, పరుగులు: 102, వికెట్లు: 3.

రెండో సెషన్‌: వికెట్లు టపటపా
బ్రేక్‌ తర్వాత కాసేపు స్మిత్, ఒకీఫ్‌ జోడి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ముఖ్యంగా ఒకీఫ్‌ చక్కటి డిఫెన్స్‌తో స్మిత్‌కు సహకారం అందించాడు. అయితే ఐదు ఫోర్లు బాదిన తను ఉమేశ్‌ బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌లో విజయ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాతి ఓవర్‌లోనే జడేజా.. లయన్‌ను అవుట్‌ చేసి ఐదు వికెట్లను పూర్తి చేశాడు. మరో రెండు ఓవర్ల అనంతరం హాజల్‌వుడ్‌ను జడేజా వికెట్ల వైపు చూడకుండానే మెరుపు వేగంతో రనౌట్‌ చేయడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తర్వాత భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించగా వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులతో టీ విరామానికి వెళ్లింది.
ఆసీస్‌ ఆడిన ఓవర్లు: 18.4, పరుగులు: 49, వికెట్లు: 3
భారత్‌ ఆడిన ఓవర్లు: 8, పరుగులు: 20, వికెట్‌: 0.


చివరి సెషన్‌: రాహుల్‌ దూకుడు
బ్రేక్‌ తర్వాత ఫామ్‌లో ఉన్న రాహుల్‌ చక్కటి కవర్‌ డ్రైవ్‌లతో బౌండరీలు బాదుతూ స్కోరును పెంచాడు. ఇదే జోరుతో 69 బంతుల్లోనే స్వీప్‌ షాట్‌తో ఫోర్‌ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మంచి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ సాగుతున్న రాహుల్‌ జోరును కమ్మిన్స్‌ అడ్డుకున్నాడు. 31.2 ఓవర్‌లో తను విసిరిన స్లో బౌన్సర్‌ను ఆడటంలో విఫలమైన రాహుల్, కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఓవర్‌లోనే కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న మురళీ విజయ్‌ నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాది ఒత్తిడి పెంచాడు. 39వ ఓవర్‌లో విజయ్‌ ఎల్బీ కోసం ఆసీస్‌ రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అయితే భారత్‌ ఆడిన 40 ఓవర్లలో ఆసీస్‌ ఒక్క ఎక్స్‌ట్రా పరుగే ఇవ్వడం విశేషం.
ఓవర్లు: 32, పరుగులు: 100, వికెట్‌: 1.

ఉమేశ్‌ దెబ్బకు బ్యాట్‌ ముక్కలు!  
రెండో రోజు ఆటలో మొదటి బంతికే మైదానంలో నవ్వులు పూశాయి. 137కి.మీ వేగంతో ఉమేశ్‌ సంధించిన బంతిని మ్యాక్స్‌వెల్‌ డిఫెన్స్‌ ఆడాడు. వెంటనే పరుగు కోసం ప్రయత్నించి ముందుకు చూడగా మ్యాక్సీ చేతిలో బ్యాట్‌ హ్యాండిల్‌ మాత్రమే ఉంది. ఉమేశ్‌ వేగానికి బ్యాట్‌ రెండు ముక్కలైంది. ఈ ఘటనతో మ్యాక్సీ కన్ఫ్యూజ్‌ అయ్యాడు. దీన్ని గమనించిన ఉమేశ్‌ వెంటనే సరదాగా నవ్వుతూ తన కండలు ప్రదర్శించాడు.  దాంతో మ్యాక్స్‌వెల్‌ కూడా నవ్వాపుకోలేకపోయాడు.  

విరాట్‌ కోలుకుంటున్నాడు  
తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడిన భారత కెప్టెన్‌ కోహ్లి వేగంగా కోలుకుంటున్నాడు. అతను రెండోరోజు ఆటలో ఫీల్డ్‌లో కనిపించకపోయినా... మ్యాచ్‌కు ముందు జరిగిన వార్మప్‌లో టీమ్‌ తో ఉత్సాహంగా పాల్గొన్నాడు. కోచ్‌ కుంబ్లేతో పాటు ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించాడు. మరోవైపు పేసర్‌ ఉమేశ్‌యాదవ్‌ ఈ మ్యాచ్‌లో విరాట్‌ బ్యాటింగ్‌ చేస్తాడని వెల్లడించాడు. ‘కోహ్లి ఫిట్‌గా ఉన్నాడు. నెట్స్‌లో అతను ప్రాక్టీస్‌ చేశాడు కూడా. మ్యాచ్‌లో అ తను బ్యాటింగ్‌కు దిగుతాడు’ అని ఉమేశ్‌ అన్నాడు.  

3   ఓ టెస్టు సిరీస్‌లో సెంచరీ లేకుండా నాలుగు అర్ధ సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్‌ రాహుల్‌. ఇంతకుముందు చేతన్‌ చౌహాన్, సిద్ధూ ఈ జాబితాలో ఉన్నారు.
1    భారత గడ్డపై అత్యధి క వ్యక్తిగత స్కోరు చేసిన ఆసీస్‌ కెప్టెన్‌గా క్లార్క్‌ (130)ను అధిగమించిన స్మిత్‌ (178).
8 జడేజా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 8వ సారి.
2 మూడు ఫార్మాట్‌లలో సెంచరీ సాధించిన రెండో ఆసీస్‌ ఆటగాడిగా (వాట్సన్‌ తర్వాత) మ్యాక్స్‌వెల్‌ నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement