అది కోహ్లికే తెలియాలి!
రాంచీ: భారత్ తో జరిగిన రెండో టెస్టులో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) గురించి ఎంత రాద్ధాంతం జరిగిందో మనకు తెలిసిందే. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదానికి తెరలేపడంతో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్రంగా మండిపడ్డాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ ధ్వజమెత్తాడు. అయితే మూడో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా తొలి సెషన్ లోనే మిగిలి ఉన్న ఒక రివ్యూను కోల్పోయింది.
కేవలం రివ్యూతో మాత్రమే శనివారం ఆటకు సిద్ధమైన ఆసీస్.. అనవసరంగా ఎల్బీ విషయంలో డీఆర్ఎస్ కు వెళ్లి దాన్నిచేజార్చుకుంది. ఆసీస్ కోరిన ఆ రివ్యూలో బంతి ముందుగా పూజారా బ్యాట్ ను తాకి ఆపై ప్యాడ్లను టచ్ చేసినట్లు కనబడింది. దాంతో థర్డ్ అంపైర్ పూర్తిగా అవుట్ ను సమీక్షించకుండానే పూజారాను నాటౌట్ గా ప్రకటించాడు. ఇదంతా ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ వేసిన 57 ఓవర్ చివరి బంతికి జరిగింది.
అయితే ఆసీస్ చివరి రివ్యూ కోల్పోయిన క్రమంలో అప్పటికే ప్యాడ్లు కట్టుకుని ఉన్న కోహ్లి.. డ్రెస్సింగ్ రూమ్ తలుపులు తీసుకొచ్చి మరీ చప్పట్లతో తన ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ ఆసీస్ కు రివ్యూలు లేకపోవడమే విరాట్ ఆనందానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. మరి అది అవునో కాదో విరాట్ కే తెలియాలి.
ఇదిలా ఉంచితే ఆ మరసటి ఓవర్ లో ఆసీస్ కు నిరాశ ఎదురైంది. లియాన్ వేసిన 58 ఓవర్ తొలి బంతి విజయ్ బ్యాట్ ను ప్యాడ్లను తాకి ఫీల్డర్ చేతిలో పడింది. దీన్ని ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. కాకపోతే రివ్యూలో క్లియర్ గా ఇన్సైడ్ ఎడ్జ్ను తీసుకున్నట్లు తేలడంతో ఇక రివ్యూలు లేని ఆసీస్ కు నిరాశే మిగలడం ఇక్కడ గమనార్హం.