విరాట్ కోహ్లి మళ్లీ విఫలం..
రాంచీ:ఆసీస్ తో సిరీస్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు . మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లి(6) మళ్లీ విఫలమయ్యాడు. ఆసీస్ పేస్ బౌలర్ కమిన్స్ బౌలింగ్ లో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి విరాట్ వెనుదిరిగాడు.ఈ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో గాయపడ్డ కోహ్లి.. కేవలం బ్యాటింగ్ కు మాత్రమే దిగినా సఫలం కాలేకపోయాడు. అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో కూడా కోహ్లి నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
120/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు తొలి సెషన్ లో మురళీ విజయ్ వికెట్ ను కోల్పోయింది. 183 బంతుల్లో 10 ఫోర్లు,1 సిక్స్ సాయంతో 82 పరుగులు చేసిన విజయ్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత చటేశ్వర పూజారాకు కోహ్లి జత కలిశాడు. కాకపోతే కోహ్లి ఆదిలోనే అవుట్ కావడంతో భారత్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. భారత్ జట్టు 85.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.