
కార్డిఫ్: టీమిండియాతో ఆదివారం జరుగనున్న టీ20 సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ తుది జట్టులో బెన్ స్టోక్స్‌ను ఆడించడంపై గ్యారంటీ ఇవ్వలేమని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పష్టం చేశాడు. మూడో టీ 20కి స్టోక్స్ జట్టుతో కలిసినప్పటికీ, తుది జట్టులో స్థానంపై ఇప‍్పుడే చెప్పలేమన్నాడు. అతనొక అసాధారణ ఆటగాడని ప్రశంచిన మోర్గాన్.. టీమిండియాతో సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో అతన్ని ఆడించడమనేది సాహసంతో కూడుకున్న నిర్ణయంగా చెప్పాడు.
ఒకవేళ స్టోక్స్ తుది జట్టులో ఉంటే మాత్రం తమ జట్టు మరింత బలోపేతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. మరొకవైపు రెండో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అలెక్స్ హేల్స్‌పై మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్టులో టీ20 క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లలో హేల్స్ ఒకడన్నాడు. ఈ క‍్రమంలోనే మూడో టీ20లో అతను నుంచి మరొక కీలక ఇన్నింగ్స్ ఆశిస్తున్నట్లు మోర్గాన్ తెలిపాడు.
ఇటీవల ఆసీస్ జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడ్డ స్టోక్స్.. భారత్‌తో జరిగిన రెండు టీ20లకు దూరమయ్యాడు. దాంతో స్టోక్స్ స్థానంలో హేల్స్‌కు అవకాశం కల్పించారు. ఒకవేళ స్టోక్స్‌కు మూడో టీ20 తుది జట్టులో అవకాశం కల్పిస్తే మాత్రం హేల్స్, జాక్ బాల్‌లు ఒకర్ని పక్కకు పెట్టాల్సి వస్తుంది. దాంతో స్టోక్స్‌ను ఆడించాలా? వద్దా? అనే దానిపై ఇంగ్లండ్ సెలక్షన్ కమిటీ తర్జన భర్జనలు పడుతోంది.