లండన్: గతేడాది ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) డైరెక్టర్ పదవికి గుడ్ బై చెప్పిన ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌కు మళ్లీ కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఈసీబీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్ని స్థాయిల్లోనూ ఇంగ్లండ్ క్రికెట్‌ను పర్యవేక్షించే కమిటీ చైర్మన్ బాధ్యతను స్ట్రాస్‌కు ఇచ్చినట్లు ఈసీబీ ప్రకటించింది. గడిచిన ఏడాది తన భార్య రూత్ క్యాన్సర్‌తో మంచాన పట్టడంతో స్ట్రాస్ డైరక్టర్ పదవిని వదులుకున్నాడు. దాంతో డైరక్టర్‌గా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆష్లే గేల్స్‌ను నియమించారు.
గత డిసెంబర్‌లో రూత్ మృతి చెందగా అప్పట్నుంచి స్ట్రాస్ క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. కాగా, మళ్లీ స్ట్రాస్‌ను క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమించడానికి ఈసీబీ మొగ్గుచూపగా, అతను కూడా అంగీకరించాడు. దీనిపై స్ట్రాస్ మాట్లాడుతూ.. ‘ నాకు కష్టకాలంలో ఈసీబీ అండగా నిలిచింది. మళ్లీ నాకు ఒక పాత్రను అప్పచెప్పడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇంగ్లండ్‌లో క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తా’ అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ ప్రధాన కోచ్ ట్రావెర్ బెయిలిస్‌ను స్ట్రాస్ నియమించిన సంగతి తెలిసిందే. బెయిలిస్ పర్యవేక్షణలోని ఇంగ్లిష్ జట్టు వరల్డ్‌కప్‌ను గెలిచి తమ చిరకాల కోరికను సాకారం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment