ఐపీఎల్ వల్లే నా మెరుపులు!!
అంతర్జాతీయ క్రికెట్‌లో పనిఒత్తిడి బాగా పెరిగిపోయిందనేది దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలీయర్స్ కంప్లైంట్. ఏడాది పొడుగుతా అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు కొనసాగడం, దీనికితోడు ఐపీఎల్ లాంటి పొట్టి క్రికెట్ సిరీస్‌లు హోరాహోరీగా జరుగుతుండటంతో క్రికెటర్లకు విశ్రాంతి అన్నదే కరువైందని ఆయన ఆవేదన. అయినప్పటికీ ఐపీఎల్ ట్వంటీ-20 సిరీస్‌కు దూరంగా ఉంటారా అంటే నో అంటున్నారు ఈ దక్షిణాఫ్రికా టెస్టు, వన్డే జట్టు కెప్టెన్.
గత ఎనిమిదేళ్లుగా ఐపీఎల్‌తో తన అనుబంధం యథాతథంగా కొనసాగుతుందని డివిలీయర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. మొదటి మూడు ఎడిషన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడిన డివిలీయర్స్ 2011 నుంచి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ప్రధాన అస్త్రంగా మారాడు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లి వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌తో కలిసి ఆయన రాయల్ చాలెంజర్స్ జట్టుకు కీలకంగా మారాడు. అయితే ఐపీఎల్‌లో కొనసాగేందుకు తాను టెస్టు క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్టు వస్తున్న వార్తలను మాత్రం డివిలీయర్స్ తోసిపుచ్చాడు. ఐపీఎల్ వల్లే తాను క్రికెటర్‌గా మరింత అభివృద్ధి సాధించినట్టు ఆయన చెప్పాడు.
'నేను ఇంకా ఐపీఎల్ ఆడుతాను. ఐపీఎల్ నుంచి నేను తప్పుకోవడం మూర్ఖమైన చర్య అవుతుంది. నా కెరీర్‌లో ఐపీఎల్ పెద్ద పాత్ర పోషించింది. నన్నొక ఆటగాడిగా అభివృద్ధి పరిచింది. నా కెరీర్‌లో అది అత్యంత కీలక పాత్ర పోషించింది' అని డివిలీయర్స్ బుధవారం విలేకరులతో చెప్పాడు. ఇప్పటికి ఐపీఎల్ నుంచి తప్పుకోనుగానీ, ఇతర ఫార్మెట్ల విషయంలో ఆలోచించి తగిన విశ్రాంతి పొందే మార్గాలను అన్వేషిస్తానని ఆయన చెప్పాడు.