
బెంగళూరు: భారత ఆటగాడు సుమీత్ నాగల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. బెంగళూరు ఓపెన్ లో శనివారం జరిగిన ఫైనల్లో అతను 6–3, 3–6, 6–2తో జే క్లార్క్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ప్రస్తుతం 321వ ర్యాంకులో ఉన్న 20 ఏళ్ల నాగల్ తాజా టైటిల్ విజయంతో 225వ ర్యాంకుకు చేరువయ్యే అవకాశముంది. ట్రోఫీతో పాటు అతను రూ. 9.36 లక్షల (14,400 డాలర్లు) ప్రైజ్‌మనీని, 100 ర్యాంకింగ్ పాయింట్లను అందుకున్నాడు. భారత్ ఆతిథ్యమిచ్చిన రెండు చాలెంజర్ ఈవెంట్లలోనూ భారత ఆటగాళ్లే టైటిల్స్ గెలిచారు. గతవారం పుణే ఓపెన్ చాలెంజర్ ఈవెంట్‌లో యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు.