సన్ ‘షైన్’ అయిందిలా...
► హైదరాబాద్ సంచలన ప్రదర్శన
► గెలిపించిన బౌలింగ్ వ్యూహం
► కెప్టెన్ నాయకత్వ పటిమతో విజయం
డేవిడ్ వార్నర్ మినహా బ్యాటింగ్‌లో మరో మెరుపు లేదు... ధావన్ పేరుకు 501 పరుగులు చేసినా అతి సాధారణ స్ట్రైక్‌రేట్ వాటి విలువను తగ్గించింది. ఇక ఇతర బ్యాట్స్‌మెన్ అంతా కలిపి టోర్నీలో చేసింది రెండే అర్ధ సెంచరీలు... అయినా సరే బ్యాట్స్‌మెన్ ఆటగా పేరుబడ్డ టి20ల్లో హైదరాబాద్ విజేతగా నిలవగలిగింది.
వరుస పరాజయాలతో ప్రారంభించిన తర్వాత కొన్ని చక్కటి ప్రదర్శనలతో ప్లే ఆఫ్ వరకు చేరినా ఆ జట్టుపై అందరికీ అపనమ్మకమే... కానీ రైజర్స్ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించింది.
‘బ్యాటింగ్ మ్యాచ్‌లు గెలిపిస్తుంది... కానీ బౌలింగ్ టోర్నీలు గెలిపిస్తుంది’ అని ఫైనల్ అనంతరం విశ్లేషకులు చేసిన వ్యాఖ్య ఈ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. తమ బౌలర్లను చివరి వరకు బలంగా నమ్మిన కెప్టెన్ వారి నుంచి కావాల్సిన ఫలితాన్ని రాబట్టాడు. ఫలితంగా అంచనాలకు అందరి రీతిలో రాణించిన రైజర్స్ ఐపీఎల్ టైటిల్‌ను చేజిక్కించుకుంది.
సాక్షి క్రీడా విభాగం:- ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ 2013లో అడుగు పెట్టింది. తొలిసారే ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించి ఆకట్టుకుంది. అయితే తర్వాతి రెండు సీజన్లు అదే ప్రదర్శనను పునరావృతం చేయడంలో విఫలమైంది. దాంతో 2014, 2015లలో ఆ జట్టు అనామకంగానే కనిపించింది. గత ఏడాది అయితే టీమ్ వైపు స్పాన్సర్లు కూడా పెద్దగా ఆకర్షితులు కాలేదు. కొన్ని స్వల్ప మార్పులు మినహా ఈసారి కూడా దాదాపు అదే జట్టు ఉండటంతో రైజర్స్‌పై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. పైగా తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఇక పాత కథే పునరావృతం అవుతుందేమో అనిపించింది. అయితే ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా పైకి ఎగసింది. ముంబై, గుజరాత్, పంజాబ్‌లపై సాధించిన వరుస విజయాలు జట్టులో ఉత్సాహాన్ని నింపాయి.
వర్షం బారిన పడిన మ్యాచ్‌లో సొంతగడ్డపై పుణే చేతిలో ఓడటం కాస్త బ్రేక్ వేసింది. అయితే హైదరాబాద్‌లో రెండు, వైజాగ్‌లో రెండు కలిపి వరుసగా నాలుగు విజయాలతో సన్ దూసుకుపోయింది. అప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్‌కు చేరువ కావడంతో తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో మూడు పరాజయాలు ఎదురైనా ఇబ్బంది ఎదురు కాలేదు. అయితే టాప్-2లో లేకపోవడంతో ఫైనల్ కోసం రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ఐదు రోజుల వ్యవధిలో వేర్వేరు వేదికల్లో మూడు నాకౌట్ మ్యాచ్‌లలో గెలుపొందడం నిజంగా అద్భుతం. దీనిని సాధించడంలో జట్టులో సమష్టి కృషి కనిపించింది.
కెప్టెన్ కమాల్...
ఐపీఎల్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లికి లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఇచ్చేందుకు జహీర్ ఖాన్ భయపడ్డాడు, సురేశ్ రైనాకు ధైర్యం సరిపోలేదు, చివరకు ధోని కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడలేదు. కానీ బెంగళూరుతో మ్యాచ్‌లో ‘చిన్న’స్వామి స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అంటే పెద్ద సాహసమే. ఈ సాహసమే రైజర్స్‌కు టైటిల్ అందించిందని ప్రత్యర్థి కోచ్ వెటోరి చెప్పడం వార్నర్ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. వార్నర్‌కు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేదు. స్యామీ, సంగక్కర, ధావన్‌ల విఫల ప్రయత్నాల తర్వాత గత ఏడాది మధ్యలో వార్నర్‌ను కెప్టెన్‌ను చేసిన యాజమాన్యం ఈసారి చాలా ముందుగానే అతని పేరును ప్రకటించింది. ఒక్క వివాదం లేదు, తప్పుడు కూత కూయలేదు, కీలక సమయాల్లో ప్రత్యర్థి స్లెడ్జింగ్ చేసినా చిరునవ్వే సమాధానమైంది.
నాయకత్వంలో జట్టుకు ఫెయిర్ ప్లే అవార్డు... డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ ఇంత గొప్పగా సాగుతుందని ఎవరూ ఊహించలేదు. మైదానం బయట అతని గత చరిత్రను, గొడవలను బట్టి వార్నర్‌ను అంచనా వేసినవారికి అతను తన సమర్థతతోనే సమాధానం చెప్పాడు. ముఖ్యంగా ‘మూగభాష’తోనే ముస్తఫిజుర్‌ను వాడుకున్న తీరు అతని నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. కీలక సమయాల్లో, సరిగ్గా గురి చూసి కొట్టినట్లుగా బంగ్లా బౌలర్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఇక బ్యాట్స్‌మెన్‌గా 848 పరుగులతో తిరుగులేని ఆటతీరు కనబర్చిన వార్నర్ సన్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు.
లోపాలున్నా...
వార్నర్, బౌలర్ల వ్యక్తిగత ప్రదర్శనలు రైజర్స్ జట్టులోని ఇతర లోపాలు కనిపించకుండా చేశాయి. ఆలస్యంగా జట్టుతో చేరిన యువరాజ్ సింగ్ రెండు మ్యాచ్‌లు మినహా తన స్థాయికి తగిన ఆటను కనబర్చలేదు. విదేశీ ఆటగాళ్లు మోర్గాన్, విలియమ్సన్ ఇద్దరూ విఫలం కాగా... ఆల్‌రౌండర్‌గా హెన్రిక్స్ ఫర్వాలేదనిపించాడు. ఫీల్డింగ్‌లో తీవ్ర ఒత్తిడి సమయంలో అతను పట్టిన 11 క్యాచ్‌లు కీలక వికెట్లను అందించాయి. ఇక యువ ఆటగాడు దీపక్ హుడా 17 మ్యాచ్‌లు ఆడినా కేవలం 144 పరుగులతో అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచాడు. బౌలింగ్‌కంటే బిపుల్ శర్మ బ్యాటింగ్ రెండో క్వాలిఫయర్‌లో జట్టుకు పనికొచ్చింది.
అయితే కొన్ని సమస్యలు సీజన్‌లో అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా... సమష్టితత్వం, సరైన వ్యూహాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. మన ఆటపై మనకు నమ్మకం ఉన్నప్పుడు గెలిచేందుకు ‘ఫ్యాన్సీ టీమ్’లాగా హడావిడి చేయాల్సిన అవసరం లేదని నిరూపించింది.
ఇద్దరూ ఇద్దరే...
గాయంతో నెహ్రా ఆడింది 8 మ్యాచ్‌లే... బరీందర్ ఆకట్టుకున్నా అద్భుతమైన బౌలర్ కాదు. ఇలాంటి స్థితిలో ఇద్దరు బౌలర్లు మొత్తం రైజర్స్ భారాన్ని మోశారు. ‘పర్పుల్ క్యాప్’ గెలుచుకున్న భువనేశ్వర్ (23 వికెట్లు)కు తోడుగా తనదైన శైలిలో కటర్‌లతో ముస్తఫిజుర్ (17) చెలరేగడం జట్టు విజయాలను సులువు చేసింది. ముఖ్యంగా ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో చివరి నాలుగు ఓవర్లు అంటే వీరిద్దరికి ఎదురు నిలిచి పోరాడటమే! 90 శాతానికిపైగా మ్యాచ్‌లలో వీరిద్దరు డెత్ ఓవర్లలో తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి జట్టును గెలిపించారు. ఒక దశలో ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లను తుది జట్టులో ఉంచి కూడా సన్ ఫలితం రాబట్టగలగడం, బౌల్ట్‌లాంటి స్టార్‌కు ఒకే మ్యాచ్‌లో అవకాశం రావడం ఆ జట్టు బౌలింగ్ బలానికి అద్దం పడుతుంది. ఎడమచేతి వాటం బౌలర్లు ప్రత్యేకమంటూ వేలంలో వారిపై దృష్టి పెట్టామని చెప్పిన లక్ష్మణ్ ముందుచూపు జట్టును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది.