సూపర్ హీరో | super hero | Sakshi
Sakshi News home page

సూపర్ హీరో

Published Mon, Dec 15 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

సూపర్ హీరో

సూపర్ హీరో

గత నెలలో విరాట్ కోహ్లి పేరిట ఓ త్రీడీ గేమ్ విడుదల అయింది. ఇందులో తనో సూపర్ హీరో. తన బ్యాట్‌కు ఉన్న శక్తితో స్పైడర్‌మ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్లపై యుద్ధం చేస్తాడు. దేశంలో ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌తోనూ ఇలాంటి గేమ్ డిజైన్ చేయలేదు. సూపర్ హీరో అనే ట్యాగ్ ఇవ్వలేదు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు చూసిన తర్వాత సూపర్ హీరో ట్యాగ్‌కు సరైన అర్హత విరాట్‌కే ఉంది.
 
 సాక్షి క్రీడావిభాగం
  నాయకుడు ఎప్పుడూ ముందుండి నడిపించాలి. ఆపదలో ఉన్నప్పుడు తెగువ చూపించాలి. యుద్ధానికి వెళితే సహచరుల కంటే ముందుగా దూసుకెళ్లాలి. ఈ లక్షణాలన్నీ కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే  విరాట్ చూపించాడు. ఏ కెప్టెన్ అయినా గెలవడానికే ఆడతాడు. తప్పదనుకుంటే డ్రా కోసం ఆడతాడు. ఆస్ట్రేలియాలో భారత్‌కు ఉన్న రికార్డు... గత సిరీస్‌లో మొత్తం అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయిన అవమానం... ఇలాంటివన్నీ ఆలోచిస్తే... తొలి టెస్టు చివరి రోజు నిదానంగా ఆడుకుని డ్రా చేసుకోవడానికే చాలామంది కెప్టెన్లు మొగ్గు చూపేవారు. కానీ కోహ్లి మాత్రం కచ్చితంగా గెలవాల్సిందే అనే ధోరణితో ఆడాడు. కెప్టెన్‌గా అతనికి వందకు వంద మార్కులు పడింది ఇక్కడే. గతంలో చాలామంది భారత కెప్టెన్లు మ్యాచ్‌లను డ్రా చేసుకోవడానికే మొగ్గుచూపేవారు. వీరికి భిన్నంగా కోహ్లి ఆలోచనా ధోరణి సాగుతోంది.
 
 కెప్టెన్‌గా హిట్
 సీనియర్ అశ్విన్‌ను కాదని ఏకైక స్పిన్నర్‌గా తుది జట్టులోకి కరణ్ శర్మను తీసుకున్నాడు. దానిని ఇప్పటికీ సమర్థించుకుంటున్నాడు. తొలిరోజు తన కెప్టెన్సీ మీద విమర్శలు వచ్చాయి. ఆత్మరక్షణ ధోరణిలో ఫీల్డింగ్ సెట్ చేశాడనే మాట వినిపించింది. కానీ వార్నర్ వేగంగా ఆడుతూ, బౌలర్లు సరైన ట్రాక్‌లో లేనప్పుడు ఏ కెప్టెన్ అయినా ఇదే చేస్తాడు. తొలిరోజు సాయంత్రం సెషన్‌లో బ్రాడ్ హాడిన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కోహ్లి... ఫీల్డర్లను పిచ్ చుట్టూ మోహరించాడు. దీంతో ఒత్తిడి పెరిగి హాడిన్ అవుటయ్యాడు. బౌలర్లకు వికెట్‌పై సహకారం లేని సమయలో ఓ కెప్టెన్ ఎలా వ్యవహరిస్తాడో విరాట్ అలాగే వ్యవహరించాడు.
 
 మద్దతు పెరుగుతోంది
 వన్డేల్లో ధోని అద్భుతమైన కెప్టెన్ అయినా... టెస్టుల్లో తన సారథ్యం సరిగా లేదని ఈ ఫార్మాట్‌కు కొత్త కెప్టెన్ కావాలని చాలా రోజులుగా వినిపిస్తోంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం కోహ్లి రూపంలో దొరికిందనే అనుకోవాలి. ధోని కూడా ఈ ప్రపంచకప్ తర్వాత ఏదో ఒక ఫార్మాట్‌ను వదులుకునే ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ అదే జరిగితే కచ్చితంగా అవి టెస్టులే అవుతాయి. తొలి టెస్టులో కోహ్లి సారథిగా ఆకట్టుకున్నందున... తనని పూర్తిస్థాయి కెప్టెన్‌ని చేయాలనే డిమాండ్ అప్పుడే ఊపందుకుంది. ఇక మిగిలిన మూడు టెస్టుల్లో ధోని కెప్టెన్సీని నిశితంగా పరిశీలిస్తారు. తను చేసే ప్రతి బౌలింగ్ మార్పునూ, ప్రతి ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌నూ భూతద్దంలోంచి చూస్తారు. ఇందులో ధోని ఏ మాత్రం విఫలమైనా... ఇక కోహ్లిని టెస్టు కె ప్టెన్ చేయాల్సిందేననే డిమాండ్‌కు ఎదురుండదు.
 
 ఆటలో సూపర్ హిట్
 రెండు ఇన్నింగ్స్‌లోనూ కోహ్లి బ్యాటింగ్ అద్భుతం. ముఖ్యంగా ఆట చివరి రోజు చేసిన 141 పరుగులు తనలో బ్యాటింగ్ పరిణతిని చూపిస్తున్నాయి. వన్డే తరహాలో తనకే సాధ్యమైన షాట్లు ఆడుతూనే... సహనమూ చూపించాడు. ఫుట్‌వర్క్, షాట్ల ఎంపిక, బంతిని గ్యాప్స్‌లోకి ఆడిన తీరు చాలా బాగుంది. టెస్టు చివరి రోజు, మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో ఇలాంటి ఆట సాధారణంగా చూడలేం. నేను డిఫెన్స్ ఆడాలని అనుకుంటే... బంతి వేయడానికి ముందే బౌలర్‌కు అదనంగా బలాన్ని ఇచ్చినట్లే’ అనేది విరాట్ మాట. అంత ఆత్మవిశ్వాసం ఉంటే  ఒక బ్యాట్స్‌మన్ బ్యాట్‌తో ఏమైనా చేయగలడు అనిపించింది.
 
 ఆసక్తి పెరుగుతుంది
 ఆస్ట్రేలియాలో టెస్టు కోసం ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి టీవీలకు అతుక్కునే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్‌ల శకం ముగిశాక టెస్టు కోసం నిద్ర లేవడమా.. అనే అభిప్రాయం చాలామందిలో వచ్చింది. కానీ అది తప్పని కోహ్లి నిరూపించాడు. మళ్లీ మన జట్టు ఆడే మ్యాచ్‌ల కోసం నిద్ర లేవాల్సిన అవసరాన్ని చూపించాడు.
 
 భారత్‌కు టెస్టుల్లో కోహ్లిని పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించాల్సిన సమయం వచ్చింది. సారథిగా ధోని సమయం ఇక అయిపోయిందని అనుకోవాలి. అయితే కోహ్లి మైదానంలో కొంత సంయమనం పాటించాలి. నాలుగోరోజు ఆటలో తొలిసారి మాటల యుద్ధం మొదలైనప్పుడు పరిణతితో వ్యవహరించాడు. కానీ రెండోసారి అదుపుతప్పాడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కెప్టెన్‌కు చాలా అవసరం. సారథ్య బాధ్యతలు ఆట మీద ప్రభావం చూపబోవని కోహ్లి తన ఇన్నింగ్స్‌తో నిరూపించాడు. కాబట్టి తనకు పూర్తిస్థాయి బాధ్యతలు ఇచ్చే దిశగా భారత సెలక్టర్లు ఆలోచించాలి.
 -ఇయాన్ చాపెల్ (ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్)
 
 తొలి టెస్టు చివరి రోజు విజయం కోసం ఆడినందుకు కోహ్లిని అభినందించాలి. ఆస్ట్రేలియా బౌలింగ్ బలం వల్ల మ్యాచ్ గెలిచింది. డ్రా కోసమే ఆడితే భారత్‌కు అనుకున్న ఫలితం వచ్చేది. కానీ విజయం కోసం ఆడటం గొప్ప విషయం.
 -అజహర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement