
ధోనీపై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు
భారత స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీపై క్రిమినల్ కేసు విచారణను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒక పత్రిక ముఖచిత్రంలో విష్ణుమూర్తి రూపంలో ధోనీ ఫొటోను ప్రచురించి.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ గతంలో ఈ కేసు నమోదైంది. కర్ణాటకలోని దిగువ కోర్టు ధోనీని విచారణకు పిలిపించడంలో చట్టపరమైన విధానాలను అవలంబించలేదన్న కారణంతో జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ధోనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. నిందితుడిని విచారణకు పిలిపిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, మొత్తం విచారణను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వులలో పేర్కొంది.
గత సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన ధోనీపై క్రిమినల్ విచారణ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అతడిపై నేర విచారణను ఆపేందుకు నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాలుచేస్తూ ధోనీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఒక వ్యాపార పత్రిక మీద ధోనీ విష్ణుమూర్తి అవతారంలో.. చేతిలో బూట్లతో కనిపించాడని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ జయకుమార్ హీరేమఠ్ అనే సామాజిక కార్యకర్త కేసు పెట్టారు. దీనిపై అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధోనీపై 295, 34 సెక్షన్ల కింద కేసులు పెట్టాల్సిందిగా ఆదేశించారు. అనంతరం కోర్టులో హాజరు కావాలని సమన్లు పంపారు. వాటిపై ధోనీ హైకోర్టును ఆశ్రయించాడు.