ఎస్వీ సునీల్
బెంగళూరు: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ అనుకోని విరామ సమయంలో సాధారణ ప్రజలే ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటే.. నిరంతరం ప్రయాణాలు, రోజంతా ప్రాక్టీస్, మ్యాచ్‌లు అంటూ బిజీగా గడిపే క్రీడాకారుల సంగతి చెప్పక్కర్లేదు. కుటుంబంతో సరదాగా గడిపే సమయం దొరికితే ఆటగాళ్లు ప్రపంచాన్ని, వారి ప్రాణమైన ఆటనే మర్చిపోతారు. కానీ భారత హాకీ ప్లేయర్ ఎస్వీ సునీల్ ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. తన భార్య, గారాల కూతురు తనకు సమీపంలోనే నివసిస్తున్నా కుటుంబానికి దూరంగా జట్టుతో ఉంటున్నాడు.
ప్రస్తుతం సునీల్ బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా... అతని భార్య నిషా, ఏడాదిన్నర వయస్సున్న కూతురు శాన్విత ‘సాయ్’ సెంటర్‌కు కేవలం 20 కి.మీ దూరంలోనే ఉంటున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కుటుంబం క్షేమం కోసమే తాను దూరంగా ఉంటున్నానని సునీల్ పేర్కొన్నాడు. తన భార్య నిషా కూడా అతని నిర్ణయంతో ఏకీభవించిందని చెప్పాడు. ‘నేను నా భార్య, బిడ్డను చాలా మిస్ అవుతున్నా. కానీ మనం ఈ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇందులోని సానుకూల కోణాన్నే మనం చూడాలి’ అని సునీల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment