స్వప్న బర్మన్, ఆమె తల్లి
స్వప్న బర్మన్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఏషియన్ గేమ్స్‌లో కఠినమైన ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్ విభాగంలో పసిడి అందించిన వీర వనిత. 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను అందుకొని శిఖరాన నిలిచిన 21 ఏళ్ల బెంగాల్ అమ్మాయి. ప్రస్తుతం స్వప్న బర్మన్‌పై సోషల్‌మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఆమె ఈ ఘనతను అంత సులువుగా అందుకోలేదు. నాడు కష్టాలతో సహవాసం చేసింది కాబట్టే నేడు చాంపియన్ అయింది. స్వప్న బర్మన్ ఎన్ని కష్టాలు పడ్డదో ఆమె తల్లి భావోద్వేగం తెలియజేస్తోంది. స్వప్న ఆటను టీవీలో తిలికించిన ఆమె తల్లి స్వప్న కల సాకారం కావడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది. బిడ్డ కష్టాన్నంత గుర్తు తెచ్చుకొని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక ఏడ్చేసింది. అంతటితో ఆగకుండా సమీప దేవాలయానికి వెళ్లి ప్రార్థనలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
స్వప్న బర్మన్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా లాగుతాడు. తల్లి స్థానికంగా ఉండే టీకొట్టులో పనిచేస్తోంది. ఉండటానికి సరిగ్గా ఇళ్లు కూడా లేదు. డబ్బాలాంటి ఓ రేకుల షెడ్డులో ఈ కుటుంబం కాలం వెళ్లదిస్తోంది. తండ్రి కూడా ఐదేళ్లుగా ఆనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయం, తల్లి కష్టంతోనే ఇల్లు గడిచింది. దీనికి తోడు ఆమె శరీరాకృతి కూడా సమస్యగా మారింది. శిక్షణ కోసం కోచ్ సుభాష్ సర్కార్ (ప్రస్తుత కోచ్ కూడా) వద్దకెళ్తే పొట్టిగా ఉన్నావ్ పోటీలకు పనికిరావని వారించారు. కానీ ఆ పొట్టి అమ్మాయే 2012 స్కూల్ గేమ్స్ (హై జంప్) పోటీల్లో స్వర్ణం గెలిచింది. వెంటనే కోచ్ నుంచి పిలుపొచ్చింది. మరోవైపు రెండు కాళ్లకు ఆరేళ్లు. షూస్‌తో సౌకర్యంగా ఉండటం చాలా కష్టం. ఏకబికిన ఏడు ఈవెంట్లలో పాల్గొనడం మరెంతో కష్టం... కానీ ఇంతకు మించిన కష్టాలే నిత్యం చవిచూసిన బర్మన్‌కు ఈ హెప్టాథ్లాన్ పోటీ ఏపాటిది! అందుకేనేమో సౌకర్యం సంగతి పక్కనబెట్టింది. పసిడే లక్ష్యంగా బరిలోకిదిగి విజయం సొంతం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడుతూ...’నేను మాములు షూస్‌నే ధరించాను. ట్రెయినింగ్‌లో చాలా నొప్పిగా ఉండేది. నాకు అవి చాలా అసౌకర్యంగా ఉండేవి.’ అంటూ తన కష్టాన్ని వివరంచింది.
మమతాజీ..10 లక్షలేనా?
స్వప్న బర్మన్ ప్రతిభను గుర్తించిన ప్రశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. అయితే ఈ నజరానాపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిరుపేద అథ్లెట్‌కు ఈ సహకారం సరిపోదని కామెంట్ చేస్తున్నారు. ఆమెకు ఆర్థికంగా సహకారం అందిస్తే భారత్‌కు మరిన్నీ పతకాలు తెచ్చిపెడుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇక రజత పతకాలు సాధించిన ద్యుతిచంద్‌కు ఒడిశా ప్రభుత్వం రూ. కోటిన్నర్ నగదు ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment