స్వప్న బర్మన్, రాహుల్ ద్రవిడ్
కోల్‌కతా: స్వప్న బర్మన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఏషియన్ గేమ్స్ ముందు వరకు అసలు ఈమె ఎవరో కూడా తెలియదు. కానీ ఈ టోర్నీలో భారత్ 68 ఏళ్ల నిరీక్షణను తెరదించుతూ హెప్టథ్లాన్ విభాగంలో తొలిసారి స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది ఈ బెంగాల్ అమ్మాయి. అప్పటి నుంచి ఈ అథ్లెట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు ఆమె ప్రతిభను కొనియాడుతున్నారు. మీడియాలో అయితే ఆమెకు సంబంధించి పుంఖాను పుంఖాను కథనాలు వెలువడుతున్నాయి. ఇలా గత వారంలో రోజులగా ఆమె పేరు దేశ్యాప్తంగా మారుమోగుతుంది.(మమతాజీ..10 లక్షల సాయమేనా?)
స్వప్నబర్మన్ ఓ నిరుపేద అథ్లెట్ అని, రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి పతకం సాధించిందన్న విషయం తెలిసిందే. అయితే ఈ నిరుపేద అథ్లెట్‌కు అండగా నిలిచింది భారత మాజీ క్రికెటర్, దివాల్ రాహుల్ ద్రవిడ్. స్వప్న బర్మన్ తండ్రి ఓ రిక్షా పుల్లర్. ఆయనకు రెండు సార్లు గుండెపోటు రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. తల్లి టీ తోటలో పనిచేపే దినసరి కూలి. ఈ పరిస్థితుల్లో స్మప్న ఆటను కొనసాగించడం కష్టమైంది. దీంతోనే ఆమె తన ఆటకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. అదే జరిగితే నేడు భారత్ ఓ బంగారం లాంటి అథ్లెట్‌ను కోల్పోయేది. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న ద్రవిడ్ ఆర్థికంగా చేయూతనిచ్చాడు. ద్రవిడ్ మెంటార్ షిప్ కార్యక్రమం ద్వారా ఆర్థికంగానే కాకుండా మానసికంగా ధృడం అయ్యేలా శిక్షణను ఇచ్చాడు. ఆమెకే కాదు 2018 ఏషియాడ్‌లో పాల్గొన్న మరో 19 అథ్లెట్లకు ‘వాల్ ఆఫ్ క్రికెట్’ అనే పేరుతో ఆర్థికంగా సాయం చేసి ప్రోత్సాహించాడు. గో స్పోర్ట్స్ భాగస్వామ్యంతో ద్రవిడ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మారుమూల గ్రామాల్లోని క్రీడా ఆణిముత్యాల ప్రతిభను వెలకితీయడమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశ్యం. ఇలా ఎంతో మంది అథ్లెట్లను ద్రవిడ్ ప్రపంచానికి పరిచయం చేశాడు.. చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment