స్విమ్మర్ టొమిటాపై 18 నెలలు నిషేధం
టోక్యో: ఆసియా క్రీడల సందర్భంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ కెమెరాను దొంగతనం చేసిన జపాన్ స్టార్ స్విమ్మర్, ప్రపంచ మాజీ చాంపియన్ నవోయా టొమిటాపై జపాన్ ఒలింపిక్ కమిటీ (జేఓసీ) కొరడా ఝళిపించింది. అతనిపై 18 నెలల నిషేధాన్ని విధించింది. 2016 మార్చి 31 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.
ఇంచియాన్ ఆసియా క్రీడల సమయంలో 25 ఏళ్ల టొమిటా దక్షిణ కొరియా వార్తా సంస్థకు చెందిన ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్ కెమెరాను తస్కరించాడు. జర్నలిస్ట్ ఫిర్యాదుతో విచారణ చేయగా... సీసీ టీవీ కెమెరా ఫుటేజిలో టొమిటా కెమెరాను చోరీ చేసినట్లు కనిపించింది. 2010 గ్వాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో స్వర్ణం నెగ్గిన టొమిటా ఈసారి ఏ పతకమూ గెలువలేదు.