
టి20ల్లోనూ చిక్కులు ఉన్నాయి: ద్రవిడ్
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్‌ను ఎవరు ఎన్ని విధాలుగా పోల్చినా... టి20లకే పరిమితమైన కొన్ని సంక్లిష్టతలు, చిక్కులు ఉన్నాయని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. ఇవేమీ సాధారణ ప్రజానికానికి అర్థం కావన్నారు. ‘ఐపీఎల్ జట్ల గురించి అప్పుడప్పుడు కొన్ని సంభాషణలు వింటుంటాం. ఇవేమీ బయటగానీ, టీవీ స్టూడియోల్లోగానీ జరగవు. ఈ విషయం నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేనూ టీవీ చర్చల్లో పాల్గొన్నా.
అయితే టి20ల గురించి లోతైన చర్చ కేవలం జట్టులో మాత్రమే జరుగుతుంది. దీనిపై బయటి వ్యక్తులకు అవగాహన లేదని నేను చెప్పను. కానీ సరిపడినంత అవగాహన మాత్రం ఉండదు. అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? అలా ఎందుకు చేయడం లేదు? అని కొంత మంది కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఎందుకలా జరుగుతుందో అర్థం మాత్రం చేసుకోరు. వాస్తవంగా లోపల ఏం జరిగిందనేదాన్ని ఎవరూ పట్టించుకోరు’ అని ద్రవిడ్ పేర్కొన్నారు. టి20 జట్లలో సమతుల్యం తెచ్చేందుకు చాలా శోధన చేయాల్సి వచ్చిందన్నారు.