టేబుల్ టెన్నిస్ గురువా.. గురివిందా? | table tennis coach caught on cctv in scuffle with female player | Sakshi
Sakshi News home page

టేబుల్ టెన్నిస్ గురువా.. గురివిందా?

Published Wed, Jan 14 2015 6:05 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

టేబుల్ టెన్నిస్ గురువా.. గురివిందా?

టేబుల్ టెన్నిస్ గురువా.. గురివిందా?

టేబుల్ టెన్నిస్ పోటీల సందర్భంగా ఓ క్రీడాకారిణికి, టీటీ కోచ్కి మధ్య తీవ్ర పెనుగులాట జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ క్రీడాకారిణిని కోచ్ పట్టుకుని అసభ్యకరంగా లాగుతున్నట్లు హోటల్ సీసీటీవీ ఫుటేజిలో బయటపడింది. దాంతో ఇది తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఫలితంగా సదరు కోచ్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఛత్తీస్గఢ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి కూడా రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇటీవల జరిగిన 76వ జాతీయ కేడెట్, సబ్ జూనియర్ టేబుల్ టెన్నిస్ పోటీలకు తాను ఆ కోచ్ని పంపినట్లు ఆయన అంగీకరించారు.

ఈ విషయం తమదృష్టికి కూడా వచ్చిందని, దీనిపై విచారణకు ఛత్తీస్గఢ్ టీటీ సంఘం ఓ త్రిసభ్య కమిటీని నియమించిందని భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య కార్యదర్శి ధనరాజ్ చౌదరి తెలిపారు. మూడు రోజుల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. తానుకూడా ఆ వీడియో చూశానని, అయితే అందులో తనకేమీ అసభ్యత కనిపించలేదని ఆయన చెప్పారు. అలాగే, క్రీడాకారిణులు ఎవరూ దీనిపై తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మీడియా ద్వారానే స్థానిక సంఘం దృష్టికి ఈ విషయం తెలియడంతో వాళ్లు దీనిపై విచారణ జరిపిస్తున్నారన్నారు. కొందరు క్రీడాకారిణుల తండ్రుల వద్దకు ఈ వీడియో చేరడంతో వాళ్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఛత్తీస్గఢ్ నుంచి మొత్తం 16 మంది ఈ టోర్నీలో పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement