
తొలి టి20లో పాక్ విజయం
29 పరుగులతో ఓడిన శ్రీలంక
కొలంబో: శ్రీలంకతో రెండు టి20ల సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా విశేషంగా రాణించడంతో గురువారం ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 29 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (38 బంతుల్లో 46; 4 ఫోర్లు), షోయబ్ మాలిక్ (31 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు), ఉమర్ అక్మల్ (24 బంతుల్లో 46; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) వేగంగా ఆడి జట్టు భారీ స్కోరుకు సహాయపడ్డారు. నాలుగో వికెట్‌కు షోయబ్, ఉమర్‌ల మధ్య 81 పరుగులు జత చేరాయి. పెరీరాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసి ఓడింది. 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. సిరివర్ధన (18 బంతుల్లో 35; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. చివర్లో కపుగెదెర (15 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. తన్వీర్‌కు మూడు, అన్వర్‌కు రెండు వికెట్లు పడ్డాయి. చివరి టి20 శనివారం జరుగుతుంది.