
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక దుబాయ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో హైదరాబాద్ ఆటగాడు కోన తరుణ్ ఆకట్టుకున్నాడు. తన భాగస్వామి లిమ్ ఖిమ్ వా (మలేసియా)తో కలసి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీకి చెందిన కోన తరుణ్–లిమ్ ఖిమ్ వా జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో తరుణ్ (భారత్)–లిమ్ ఖిమ్ వా (మలేసియా) ద్వయం 16–21, 9–21తో కిమ్ సంగ్ సో–యో యోంగ్ సియోంగ్ (కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
అంతకుముందు సెమీస్‌లో 21–16, 21–13తో డెన్నిస్ గ్రాచెవ్–పావెల్ కోస్టారెంకో (రష్యా) జంటపై గెలుపొందింది. క్వార్టర్స్‌లో ఈ జంటకు వాకోవర్ లభించింది. ప్రిక్వార్టర్స్‌లో 14–21, 21–18, 21–18తో సి సుంగ్–జిన్ సో లిమ్ (కొరియా)పై విజయం సాధించింది.