ఇప్పటికీ మాది బలమైన జట్టే | This team has played better overseas than Indian teams | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ మాది బలమైన జట్టే

Published Thu, Sep 6 2018 12:55 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

This team has played better overseas than Indian teams - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌లో ఓటమి పాలైనప్పటికీ, టీమిండియాకు విదేశాల్లో టెస్టు సిరీస్‌లు గెలవగల సత్తా ఉందని అంటున్నాడు కోచ్‌ రవిశాస్త్రి. దీనికి ఉదాహరణగా 2015 నుంచి మూడు సిరీస్‌లు, తొమ్మిది టెస్టులు నెగ్గిన ఉదంతాన్ని గుర్తుచేశాడు. ‘గొప్ప గొప్ప ఆటగాళ్లున్నప్పటికీ ఇన్ని విజయాలను, ఇంత తక్కువ సమయంలో గత 15–20 ఏళ్లలో ఏ భారత జట్టూ సాధించలేదు. ఈ గణాంకాలే వాస్తవాన్ని చెబుతాయి. ఓడినప్పుడు బాధ సహజం. కానీ, ఆ పరిస్థితిని దాటి సరైన రీతిలో పోరాటంతో జవాబివ్వాలి. గెలుపు తీరాన్ని చేరాలి. నిన్ను నువ్వు నమ్మితే ఏనాటిౖకైనా అది సాధ్యమే’ అని బుధవారం మీడియా సమావేశంలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. ప్రసుత్త సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ మానసికంగా దృఢంగా లేరని, ఇంగ్లండ్‌కు పుంజుకునే అవకాశాలు ఇచ్చామని కోచ్‌ వివరించాడు. నాలుగో టెస్టు తప్పి దాలను సరిచేసుకుంటామని, చివరి మ్యాచ్‌లో పట్టు విడవకుండా పోరాడతామని అన్నాడు.

సిరీస్‌లో భారత్‌కు ‘గెలుపు అవకాశాలు’ వచ్చిన నిజాన్ని గుర్తించాలని రవిశాస్త్రి సూచించాడు. ‘స్కోరు బోర్డు 3–1గా కనిపిస్తూ సిరీస్‌ కోల్పోయి ఉండవచ్చు. ఇది టీమిండియా 3–1తో గెలిచి ఉండాల్సిందని, లేదా 2–2తో సమం కావల్సిందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే, అది మా జట్టుకు తెలుసు. ఓటములతో ముఖ్యంగా నాలుగో టెస్టు తర్వాత వారు బాధ పడుతున్నారు. కానీ, ఈ జట్టు చేతులెత్తేసి ఇంటికెళ్లేందుకు మొదటి విమానం ఎక్కేసే రకం కాదు. పరిస్థితులపై పోరాడే రకం’ అంటూ రవిశాస్త్రి ఒకింత తీవ్రంగా వ్యాఖ్యానించాడు. విదేశాల్లో గట్టి పోటీతో విజయాలకు దగ్గరగా వచ్చామని, ఇప్పుడు చేయాల్సింది విజయంతో ముగించడమని విశ్లే షించాడు. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకుని సరిచేసుకోవాల్సి ఉందని సూచించాడు. సౌతాంప్టన్‌లో పుజారా శతకం చేసినా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో భారీ ఆధిక్యం దక్కలేదని రవిశాస్త్రి అన్నాడు. తొలి టెస్టు ఓటమి కంటే... మెరుగైన స్థితి లో ఉండీ నాలుగో టెస్టులో పరాజయం పాలవడం టీమిండియాను మరింత బాధించిందన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement