యువీ రికార్డుపై భజ్జీ హర్షం
బర్మింగ్‌హామ్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాతో రెండో సెమీఫైనల్లో ఆడిన యువీకి ఇది 300వ వన్డే కావడం విశేషం. యువీ అసలైన చాంపియన్ అంటూ ఈ సంతోషాన్ని గురువారం మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. యువీతో అనుబంధం రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతుందన్నాడు. మరోవైపు భారత మాజీ క్రికెటర్లు మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లు మాత్రమే మూడొందల మార్కును చేరగా.. తాజాగా ఆ దిగ్గజాల సరసన యువీ నిలిచాడు.
'నా స్నేహితుడు, సోదరుడు యువీ 300వ వన్డే ఆడటం చాలా సంతోషంగా ఉంది. భారత క్రికెట్లో ఇది నిజంగానే గొప్ప విషయం. అరుదైన మార్కును చేరుకున్న యువీకి శుభాకాంక్షలు. దేవుడు యువీపై, నాపై దయ ఉంచాడు. అందువల్లే నేను 100 టెస్టులు ఆడగా.. యువరాజ్ నువ్వు రికార్డు స్థాయిలో 300 వన్డేలు ఆడుతున్నావు. నువ్వు మైదానంలోనే కాదు.. నిజ జీవితంలోనూ చాంపియన్‌వి. బంగ్లాతో మ్యాచ్‌లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధిస్తావన్న నమ్మకం ఉందని' పేర్కొంటూ భజ్జీ ట్విట్టర్లో ఈ వీడియో షేర్ చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లో యువీకి బ్యాటింగ్ రాలేదు. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఈ ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.