కొలంబొ : డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా మరోసారి టైటిల్ నిలబెట్టుకుంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న అండర్-19 అసియా కప్‌ను యువ భారత జట్టు మరోసారి కైవసం చేసుకుంది. శనివారం ప్రేమదాస స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్‌పై ఎలాంటి ఆశలు లేని సమయంలో లెగ్ స్పిన్నర్ అధర్వ అంకోలేకర్ ఐదు వికెట్లతో చెలరేగడంతో టీమిండియా విజయం అందుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 32.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ ధృవ్ (33), కరణ్ లాల్(37) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బంగ్లా బౌలర్లలో షామిమ్ హుస్సేన్ (3/8), చౌదరి(3/18) చెలరేగిపోయారు.
అనంతరం 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ అధర్వ బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. దీంతో 33 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది. అధర్వతో పాటు ఆకాశ్ సింగ్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. విజయం అసాధ్యమనుకున్న మ్యాచ్‌లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన అధర్వకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆసాంతం తన బ్యాటింగ్‌తో టీమిండియాకు ఎదురేలేని విజయాలు అందించిన అర్జున్ ఆజాద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment