ఆంధ్ర క్రికెటర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74
23 పరుగులిచ్చి 2 వికెట్లు కైవసం
రెండో టి20లోనూ భారత్ భారీ విజయం
మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ సొంతం
శనివారం హైదరాబాద్‌లో చివరి మ్యాచ్
అందివచ్చి న అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పడుతూ... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం సాధించింది.
నితీశ్, రింకూ సింగ్ అర్ధశతకాలతో టీమిండియా భారీ స్కోరు చేయగా... బంగ్లాదేశ్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత జట్టు టి20 సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ శనివారం హైదరాబాద్‌లో జరుగుతుంది.
న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత జట్టు... టి20ల్లోనూ అదే జోరు కనబర్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. స్వదేశంలో టీమిండియాకు ఇది వరుసగా 16వ సిరీస్ విజయం కావడం విశేషం. ఆంధ్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన ఫలితంగా... మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో టి20లో భారత్ 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
పరుగుల తేడా పరంగా బంగ్లాపై టీమిండియాకిదే అతిపెద్ద విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నితీశ్ (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరిపించాడు. రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగా ఆడాడు.
అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. మహ్ముదుల్లా (39 బంతుల్లో 41; 3 సిక్సర్లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు.
వైజాగ్ కుర్రాడి వీరవిహారం...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండు బౌండరీలతో జోరు కనబర్చిన ఓపెనర్ సంజూ సామ్సన్ (10) రెండో ఓవర్ చివరి బంతికి ఔట్ కాగా.. కాసేపటికే మరో ఓపెనర్ అభిõÙక్ శర్మ (15) అతడిని అనుసరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ (8) కూడా వెనుదిరగడంతో టీమిండియా 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో విశాఖపట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. మహ్ముదుల్లా బౌలింగ్‌లో 6,4తో మోత ప్రారంభించిన నితీశ్... రిషాద్ వేసిన 10వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 100 పరుగులు దాటింది.
ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడిన నితీశ్ 27 బంతుల్లో తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిరాజ్ వేసిన 13వ ఓవర్‌లో నితీశ్ 6,4,2,6,6 బాది మొత్తం 26 పరుగులు రాబట్టాడు. ఇదే జోష్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి నితీశ్ ఔట్ కాగా.. ఆ తర్వాత బాదే బాధ్యత రింకూ, పాండ్యా తీసుకున్నారు. వీరిద్దరూ విజృంభించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
ఆది నుంచి తడబాటే!
ఛేదన ఏ దశలోనూ బంగ్లాదేశ్ లక్ష్యం దిశగా సాగలేదు. భారత్ తరఫున బౌలింగ్ చేసిన ఏడుగురు ప్రభావవంతంగా బంతులు వేయగా... పరుగులు రాబట్టేందుకు బంగ్లా బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డారు. మూడో ఓవర్‌లో పర్వేజ్ హుస్సేన్ (16)ను ఔట్ చేసి అర్ష్ దీప్ వికెట్ల పతనానికి తెరలేపగా... అది చివరి వరకు కొనసాగింది.
వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. బ్యాట్‌తో సంచలన ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి బంతితోనూ చెలరేగి తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) నజ్ముల్ (బి) తస్కీన్ 10; అభిషేక్ (బి) తన్జీమ్ 15; సూర్య (సి) నజు్మల్ (బి) ముస్తఫిజుర్ 8; నితీశ్ కుమార్ రెడ్డి (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 74; రింకూ సింగ్ (సి) జాకిర్ అలీ (బి) తస్కీన్ 53; పాండ్యా (సి) మిరాజ్ (బి) రిషాద్ 32; రియాన్ పరాగ్ (సి) మహ్ముదుల్లా (బి) తన్జీమ్ 15; సుందర్ (నాటౌట్) 0; వరుణ్ చక్రవర్తి (సి) పర్వేజ్ (బి) రిషాద్ 0; అర్ష్ దీప్ (సి) లిటన్ దాస్ (బి) రిషాద్ 6; మయాంక్ యాదవ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–17, 2–25, 3–41, 4–149, 5–185, 6–213, 7–214, 8–214, 9–220, బౌలింగ్: మిరాజ్ 3–0–46–0; తస్కీన్ 4–0–16–2; తన్జీమ్ 4–0–50–2; ముస్తఫిజుర్ 4–0–36–2; రిషాద్ 4–0–55–3; మహ్ముదుల్లా 1–0–15–0.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (బి) అర్ష్ దీప్ 16; లిటన్ దాస్ (బి) వరుణ్ 14; నజ్ముల్ (సి) పాండ్యా (బి) సుందర్ 11; తౌహిద్ (బి) అభిõÙక్ 2; మిరాజ్ (సి) (సబ్) రవి బిష్ణోయ్ (బి) రియాన్ 16; మహ్ముదుల్లా (సి) రియాన్ (బి) నితీశ్ 41; జాకీర్ అలీ (సి) సుందర్ (బి) మయాంక్ యాదవ్ 1; రిషాద్ (సి) పాండ్యా (బి) వరుణ్ 9; తన్జీమ్ (సి) పాండ్యా (బి) నితీశ్ 8; తస్కీన్ (నాటౌట్) 5; ముస్తఫిజుర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–40, 3–42, 4–46, 5–80, 6–83, 7–93, 8–120, 9–127, బౌలింగ్: అర్ష్ దీప్ 3–0–26–1; నితీశ్ కుమార్ రెడ్డి 4–0–23–2; వాషింగ్టన్ సుందర్ 1–0–4–1; వరుణ్ చక్రవర్తి 4–0–19–2; అభిషేక్ 2–0–10–1; మయాంక్ యాదవ్ 4–0–30–1; రియాన్ పరాగ్ 2–0–16–1.
Comments
Please login to add a commentAdd a comment