
4 బంతుల్లో.. 4 వికెట్లు
బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 42.2 ఓవర్లలో 123 పరుగులకు కుప్పకూలింది.
హరారే: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్లో భారత బౌలర్లు జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో వన్డేలోనూ టీమిండియా బౌలర్లు చెలరేగి.. జింబాబ్వే బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 42.2 ఓవర్లలో 123 పరుగులకు కుప్పకూలింది. దీంతో జింబాబ్వే 124 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. భారత బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణించి నాలుగు వికెట్ల పడగొట్టాడు. జింబాబ్వే జట్టులో అత్యధికంగా సిబండా 38 పరుగులు చేశాడు. జింబాబ్వే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుంది.
పరుగుల వేటలో బోల్తా: మూడో వన్డేలోనూ జింబాబ్వే బ్యాట్స్మెన్ పరుగుల వేటలో చతికిలపడ్డారు. సిబండాతో పాటు చిబాబా 27, మరుమా 17, మడ్జివా 10 (నాటౌట్) పరుగులు చేయగా, ఇతర ఆటగాళ్ల స్కోరు సింగిల్ డిజిట్కే పరిమితమైంది. భారత బౌలర్లు చహల్ రెండు, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో భారత్ బౌలర్ ధావల్ కులకర్ణి.. ఓపెనర్ మసకద్జ (8)ను అవుట్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత చిబాబా, సిబండా కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా ఆచితూచి పరుగులు రాబట్టారు. దీంతో రన్రేట్ మందగించింది. చహల్ వీరిద్దరినీ అవుట్ చేయడంతో జింబాబ్వే తేరుకోలేకపోయింది. ఇక బుమ్రా.. మరుమాను పెవిలియన్కు చేర్చడంతో జింబాబ్వే వికెట్ల పతనం వేగంగా సాగింది.
వరుసగా 4 వికెట్లు: ఇన్నింగ్స్ 33వ ఓవర్లో చివరి రెండు బంతులకు భారత బౌలర్ బుమ్రా వరుసగా మరుమా, చిగుంబరలను అవుట్ చేశాడు. మరుమాను బౌల్డ్ చేయగా, చిగుంబర క్యాచ్ను వికెట్ల వెనుక ధోనీ అందుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్ అంటే ఇన్నింగ్స్ 34వ ఓవర్ తొలి బంతికి వాలర్ రనౌట్ అయ్యాడు. పటేల్ ఆ తర్వాతి బంతికి క్రెమెర్ను ఎల్బీగా వెనక్కిపంపాడు. దీంతో జింబాబ్వే వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జింబాబ్వే ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగలేదు. టిరిపనో రనౌట్ అవడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది.
తొలి రెండు వన్డేల్లో ధోనీసేన గెలిచి సిరీస్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లోనూ భారత్ గెలిస్తే క్లీన్ స్వీప్ చేసినట్టవుతుంది.