సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లకు నిరాశ ఎదురైంది. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలబాలికల విభాగంలో తెలంగాణ జట్లకు తొలి ఓటమి ఎదురైంది. దీంతో లెవల్–1 స్థాయిలో తెలంగాణ పోరాటం ముగిసింది. ఇక తెలంగాణ జట్లు లెవల్–2 స్థాయిలో వర్గీకరణ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. శనివారం మొదట జరిగిన బాలుర మ్యాచ్‌లో తెలంగాణ 60–106తో చండీగఢ్ జట్టు చేతిలో చిత్తుగా ఓటమి పాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన చండీగఢ్ జట్టు తొలి 3 నిమిషాల్లోనే వరుసగా 10 పాయింట్లు సాధించి తెలంగాణ జట్టుపై ఒత్తిడి పెంచింది. శౌర్య, గౌతమ్ రాణించడంతో తెలంగాణ ఆధిక్యాన్ని 6–10కి తగ్గించింది.
ఈ స్థాయిలో మాత్రమే తెలంగాణ పోటీతత్వాన్ని కనబరిచింది. తర్వాత వారి జోరు ముందు మనవాళ్లు తేలిపోయారు. తొలి రెండు క్వార్టర్స్‌లో వారి హవానే కొనసాగింది. దీంతో తొలి అర్ధభాగం 48–30తో ముగిసింది. మూడో క్వార్టర్‌లో చండీగఢ్ ప్లేయర్లు హర్మన్‌దీప్ (27 పాయింట్లు), అభిషేక్ (18 పాయింట్లు) మరింత చెలరేగి ఆడారు. ఇదే జోరు చివరి వరకు కొనసాగించారు. ప్రత్యర్థి జట్టులో హర్మన్, అభిషేక్‌తో పాటు సన్నీ (20), అక్షయ్ (12) ఆకట్టుకున్నారు. తెలంగాణ జట్టులో కార్తీక్ (15), గౌతమ్ (10), ఆంథోని (9), సౌరవ్ (9) రాణించారు.
మరోవైపు బాలికల కేటగిరీలో చండీగఢ్ 68–66తో తెలంగాణను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆధిక్యం ఇరువురి చేతులు మారుతూ వచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా తలపడటంతో తొలి అర్ధబాగంలో చండీగఢ్ 29–27తో స్పల్ప ఆధిక్యంలో నిలిచింది. అనంతరం తెలంగాణ ప్లేయర్లు గట్టి పోటీనిచ్చినా... చివర్లో ఒత్తిడికి తేలిపోయి ఓటమి పాలయ్యారు. తెలంగాణ జట్టులో సిద్ధిక (26) పట్టుదలగా ఆడింది. హర్షిత (13), ఓజస్వి (7), రియా (7), యశస్విని (5), శ్రేయ (5) రాణించారు. చండీగఢ్ జట్టులో నిహారిక (35) విజృంభించింది. రియా 13 పాయింట్లతో ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment