
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది.
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్‌లో టైటాన్స్ 24–30 స్కోరుతో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో తెలుగు జట్టుకిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. టైటాన్స్ జట్టులో వికాస్ (9 పాయింట్లు) రాణించగా, రాహుల్ చౌదరి, నీలేష్ సాలుంకే తలో 5 పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున మణిందర్ సింగ్ (11) రెచ్చిపోయాడు. జంగ్ కున్ లీ 8 పాయింట్లు సాధించాడు. బెంగాల్ డిఫెండర్లు టైటాన్స్ రైడర్లను అద్భుతంగా కట్టడి చేశారు. మణిందర్ ప్రదర్శనతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 19–14తో బెంగాల్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి రైడింగ్‌లో నిరాశపరిచాడు.
హర్యానా, గుజరాత్ మ్యాచ్ టై
అంతకుముందు హర్యానా స్టీలర్స్, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ 27–27తో టైగా ముగిసింది. మ్యాచ్ ముగిసే దశలో హర్యానా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. కేవలం 5 నిమిషాల వ్యవధిలో 13 పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో స్టీలర్స్ తరఫున సుర్జీత్ సింగ్, వికాస్ ఆరేసి పాయింట్లు చేయగా, గుజరాత్ జట్టులో మహేంద్ర కుమార్ 5 పాయింట్లు సాధించాడు. హైదరాబాద్ అంచె పోటీల్లో భాగంగా గురువారం జరిగే చివరి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.