ఢాకా: ఇటీవల బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ షకిబుల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రెండేళ్లు నిషేధం విధించడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమ జట్టును ఇప్పటివరకూ షకిబుల్ సమర్ధవంతంగా నడిపించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం ప్రయోగాలు చేస్తోంది. టీ20 ఫార్మాట్‌కు మహ్మదుల్లాను కెప్టెన్‌గా నియమించిన బీసీబీ.. టెస్టులకు మాత్రం మోమినల్ హక్‌ను సారథిగా నియమించింది. దీనిపై మోమినల్ హక్ మాట్లాడుతూ.. ఇదొక ఊహించని పరిణామంగా పేర్కొన్నాడు. తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.
‘నేను ఎప్పుడూ కెప్టెన్సీ కోసం ఆలోచించలేదు. కెప్టెన్సీ చేయాలనే ఆలోచన కూడా లేదు. అసలు బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా చేస్తారని ఏ రోజూ ఊహించలేదు. నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. కాస్త బలవంతంగానే ఆ పాత్రను నాకు కట్టబెట్టారు. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం జట్టును సమర్ధవంతంగా నడిపించడమే. అల్లా దయవల్ల నేను కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. కెప్టెన్సీ కారణంగా అదనపు ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ మనం అలా అనుకుంటే మాత్రం కచ్చితంగా ఒత్తిడి పడుతుంది. నేను గతంలో ఏ రకంగా స్వేచ్ఛగా ఆడానో, అదే తరహా ప్రదర్శనను ఇవ్వడానికి యత్నిస్తా’ అని మోమినల్ హక్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా చేయడం ఒక గొప్ప అవకాశం అయితే, భారత్‌తో డే అండ్ నైట్ టెస్టులో ఆడటం ఇంకా గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment