వెస్టిండీస్ పేస్ బౌలర్ కీమర్ రోచ్ రౌండ్ ద వికెట్‌గా వచ్చి తొలి బంతిని వేయగా ఇంగ్లండ్ ఎడంచేతి వాటం ఓపెనర్ రోరీ బర్న్స్ దానిని సమర్థంగా డిఫెన్స్ ఆడాడు... దాదాపు నాలుగు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఇలా మళ్లీ మొదలైంది. ప్రేక్షకుల చప్పట్లు, ఉత్సాహపు హోరు ఏమీ కనిపించకుండా ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తమ ఆటను మొదలు పెట్టేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చిన క్రికెట్‌ను వరుణుడు మాత్రం కరుణించలేదు. భయపడినట్లుగానే తొలి రోజు ఆటలో చాలా భాగం వర్షం బారిన పడింది. తొలి రోజు సంఘీభావం, సంతాపం మినహా రోజ్ బౌల్‌లో ఎలాంటి విశేషాలు లేకుండానే క్రికెట్ సాగింది.
సౌతాంప్టన్: సీజన్‌కు తగినట్లుగానే ఇంగ్లండ్‌లో వాన తన ప్రతాపం చూపించడంతో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ నిరాశాజనకంగా మొదలైంది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు తగిన వినోదం దక్కలేదు. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది.
రెండో ఓవర్లోనే...
సుమారు పది నెలల తర్వాత వెస్టిండీస్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న పేసర్ షెనాన్ గాబ్రియెల్ తన తొలి ఓవర్లోనే సత్తా చాటాడు. అతను వేసిన నాలుగో బంతిని ఆడకుండా చేతులెత్తేసిన సిబ్లీ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత పదే పదే వచ్చిన అంతరాయాల మధ్య బర్న్స్, డెన్లీ జట్టు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత ఆగిన ఆట మళ్లీ మొదలు కాలేదు.
మళ్లీ మళ్లీ...
తొలి టెస్టు ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు.
బ్రాడ్ అవుట్...
ఇంగ్లండ్ తుది జట్టులో సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు చోటు దక్కలేదు. సొంతగడ్డపై జరిగిన ఒక టెస్టులో బ్రాడ్ ఆడకపోవడం 2012 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
మోకాళ్లపై కూర్చోని...
అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్‌లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్‌లు ధరించారు.
రూట్‌కు రెండో అబ్బాయి...
ఇంగ్లండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్‌కు మరో బాబు పుట్టాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా రూట్ అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య ప్రసవం కారణంగానే రూట్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ‘ఇంగ్లండ్ జట్టుకు బెస్టాఫ్ లక్. మేం మ్యాచ్ చూస్తూ మీకు మద్దతునిస్తాం’ అంటూ కొత్తగా పుట్టిన అబ్బాయి, తన పెద్ద కొడుకు ఆల్ఫ్రెడ్ విలియమ్‌తో కలిసి ఉన్న ఫోటోను అతను పోస్ట్ చేశాడు. విరామం అనంతరం రూట్ నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. ఆ తర్వాత రెండో టెస్టు కోసం అతను మాంచెస్టర్‌లో జట్టుతో కలుస్తాడు. రూట్ గైర్హాజరు కారణంగా తొలి టెస్టులో జట్టుకు స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు తరఫున 81వ కెప్టెన్‌గా స్టోక్స్ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment