ఆడితేనే ఆసీస్‌కు!
భారత జట్టులో ఇప్పుడు ఉన్న ఆటగాళ్లలో రాబోయే ప్రపంచ కప్‌కు చోటు దక్కించుకోగలవారు ఎంత మంది? కెప్టెన్ ధోని, కోహ్లి మినహా మిగతా ఆటగాళ్ల గురించి ఏదో ఒక మూల కొంత సందేహమే కనిపిస్తోంది. వన్డే స్టార్లు అనిపించుకున్నవారు చాలా కాలంగా విఫలమవుతూ జట్టుపై ఒత్తిడి పెంచుతున్నారు. అలాంటి ఆటగాళ్లకు ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ మరో అవకాశం ఇస్తోంది. దాదాపు ఇక్కడి మైదానాలనే పోలి ఉండే ఆస్ట్రేలియాలో నిలబడగల సత్తా ఎంత మందికి ఉందో ఈ సిరీస్ ద్వారా తేలిపోతుంది. ఇక్కడ ఘోరంగా ఆడితే ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ జట్టులో స్థానంపై ఆశలు వదిలేసుకోవాల్సిందే!
ధోని సేనకు మరో పరీక్ష
నేటినుంచి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్
ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి
రాణిస్తేనే ప్రపంచకప్ జట్టులో అవకాశం
తొలి మ్యాచ్‌కు వర్షం గండం
బ్రిస్టల్: ఆసియా బయట భారత జట్టు తానాడిన చివరి ఏడు వన్డేల్లో ఒక్కటీ గెలవలేదు. సొంతగడ్డపై ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌లను గట్టెక్కించిన మన ఆటగాళ్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో మాత్రం అలాంటి అద్భుతాలు చేయలేకపోయారు. ఇప్పుడు దాదాపు అలాంటి వేదికలపైనే భారత్ మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య సోమవారం తొలి మ్యాచ్ జరగనుంది. టీమిండియా ఇక్కడ విజయాన్ని అందుకుంటే ప్రపంచకప్ సన్నాహకాలు ఆశాజనకంగా ఆరంభమైనట్లే. ఆ మెగా టోర్నీని దృష్టిలో ఉంచుకొని దేశవాళీ వన్డేలను బీసీసీఐ ముందుకు జరిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆటగాళ్లపై ఒత్తిడి నెలకొంది. దేశవాళీలో ఎవరైనా అద్భుతంగా రాణిస్తే వారే ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం ఉంటుంది.
ఓపెనింగ్ సమస్యే
ప్రపంచకప్‌కు ముందు భారత్ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. గత ఆరు వన్డేల్లో 14, 10, 15, 22, 64, 8 పరుగుల భాగస్వామ్యాలు నమోదు కావడం మన ఓపెనింగ్ సమస్యను సూచిస్తోంది. ఆరంభంలో అద్భుత బ్యాటింగ్‌తో దూసుకొచ్చిన ధావన్ చాలా కాలంగా ఆ జోరుకు దూరమయ్యాడు. అవసరం కొద్దీ ఓపెనర్‌గా మారిన రోహిత్... భారత్ బయట చేసిందేమీ లేదు. టెస్టుల్లో కోహ్లి విఫలమైనా...వన్డేల్లో అతని ఆటతీరుకు ఉన్న గుర్తింపును బట్టి చూస్తే ఆందోళన అనవసరం. ఇక మిడిలార్డర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉపఖండం బయట రైనా బలహీనంగా కనిపిస్తున్నాడు. రహానే, రాయుడు తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాల్సి ఉంది. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయాడు. ఇక రాయుడుకు తుది జట్టులో స్థానం దొరకడం కష్టంగానే ఉంది.
కూర్పు ఎలా..?
లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల జడేజా, అశ్విన్ వన్డేల్లో రెగ్యులర్ సభ్యులు. అయితే గత బంగ్లాదేశ్ సిరీస్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఇంగ్లండ్ వికెట్లపై మీడియం పేస్ అవసరం అనుకుంటే జడేజా స్థానంలో బిన్నీకి చోటు దక్కవచ్చు. ముగ్గురు రెగ్యులర్ పేసర్లు భువనేశ్వర్, షమీ, ఉమేశ్ వన్డే సిరీస్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ధోని కెప్టెన్‌గా ఆడిన గత ఏడు వన్డేల్లో ఆరు సార్లు ఫీల్డింగ్‌నే ఎంచుకోగా... అన్నిసార్లూ ఓడిపోయారు. ఒక వన్డేలో ముందుగా బ్యాటింగ్‌కు దిగి 278 పరుగులు చేసినా కాపాడుకోలేకపోయారు. ఇక కొత్త ఆటగాళ్లు సంజు శామ్సన్, కరణ్ శర్మలకు తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కడం కష్టంగానే ఉంది.
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్
టెస్టు సిరీస్ నెగ్గిన జోరులో ఇంగ్లండ్ వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. అయితే సొంతగడ్డపై ఆ జట్టు గత రెండు వన్డే సిరీస్‌లను కూడా కోల్పోయింది. ఓపెనర్‌గా కుక్‌తో పాటు తొలి సారి జట్టులోకి వచ్చిన హేల్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. బెల్, రూట్, మోర్గాన్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. పేస్ ఆల్‌రౌండర్లను పరిశీలించాలని భావిస్తున్న ఇంగ్లండ్ మొయిన్ అలీని పక్కన పెట్టనుంది. కీపర్ బట్లర్ కూడా ఎంత ప్రమాదకారో టెస్టుల్లోనే భారత్‌కు తెలిసింది.
జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రైనా, జడేజా/బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్.
ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హేల్స్, బెల్, రూట్, మోర్గాన్, వోక్స్/స్టోక్స్, బట్లర్, జోర్డాన్, ట్రెడ్‌వెల్, అండర్సన్, గర్నీ.
ప్రపంచకప్ దాకా ఫ్లెచరే!
‘వన్డే సిరీస్‌లో అన్ని విషయాలు చూసుకునేందుకు రవిశాస్త్రి ఉన్నా, జట్టుకు ఇప్పటికీ ఫ్లెచరే బాస్. ఆయన స్థాయి, అధికారాలు ఏమీ తగ్గించలేదు. వచ్చే ప్రపంచకప్ వరకూ కూడా ఫ్లెచర్ మాతోనే ఉంటారు. బయటివారు ఏమనుకుంటున్నా... మరికొంత మంది సహాయక సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్‌లో చేరడం మినహా జట్టులో రోజువారీ కార్యక్రమాలు గతంలో తరహాలోనే కొనసాగుతున్నాయి. బయటినుంచే రవిశాస్త్రి పర్యవేక్షిస్తారు. అయితే ఒక మాజీ క్రికెటర్‌గా ఆటగాళ్లతో తరచూ మాట్లాడుతూ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలిస్తే ఫీల్డింగ్ కోచ్ (పెన్నీ) ఏం చేయగలడు పాపం! మేం ప్రపంచ చాంపియన్లమని ఎవరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆఖరిసారి ఇంగ్లండ్‌లో మేం చాంపియన్స్ ట్రోఫీ గెలిచామని మరచిపోవద్దు. మేం బాధ్యతాయుతంగా ఆడటమే ముఖ్యం. మా సన్నాహకాలు చాలా బాగున్నాయి. ఫార్మాట్ మార్పుతో మా మానసిక స్థితి కూడా మారిపోయింది’
-ధోని, భారత కెప్టెన్