కెప్టెన్ సెంచరీ చేసినా లంకకు పరాభవం
కెప్ టౌన్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో వన్డేలో చివరి వరకు పోరాడిన లంక ఓటమి పాలైంది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన లంక ఓ దశలో 29 ఓవర్లకు 216/2 తో పటిష్టస్థితిలో కనిపించినా.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 40 పరుగులతో ఓటమి తప్పలేదు. దీంతో సిరీస్ లో 4-0తో సఫారీల జోరు కొనసాగుతోంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా డుప్లెసిస్ భారీ సెంచరీ (185, 141 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చెలరేగడంతో 5 వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. డికాక్ (55, 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ డివిలియర్స్ (64, 62 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. మొదట చేతులెత్తేసిన సఫారీ బౌలర్లు చివర్లో చెలరేగడంతో ఉత్కంఠపోరులో విజయాన్ని సాధించారు.
368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఓపెనర్లు శుభారంభాన్ని (139 పరుగులు) ఇచ్చారు. డిక్ వెల్లా(58)తో పాటు మరో ఓపెనర్, లంక కెప్టెన్ తరంగ సూపర్ సెంచరీ (119, 90 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు)తో చెలరేగడంతో ఓ దశలో నెగ్గేలా కనిపించారు. అయితే పార్నెల్.. తరంగ, కుశాల్ మెండిస్(29)ను ఔట్ చేసి లంకను దెబ్బతీశాడు. ఆ తర్వాత కేవలం వీరక్కోడై(58, 51 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్), గుణరత్నే(38) మాత్రమే రెండంకేల స్కోరు చేశారు. 45వ ఓవర్లో తొలి బంతికి కులశేకర(1)ను, చివరి బంతికి వీరక్కోడై(58)ని ఇమ్రాన్ ఔట్ చేసి లంక కష్టాలను పెంచేశాడు. 49వ ఓవర్ తొలి బంతికి సందకన్ ను పార్నెల్ బౌల్డ్ చేయడంతో లంక 327 పరుగులకు ఆలౌటై సిరీస్ లో మరో ఓటమిని మాటకట్టుకుంది. సఫారీ బౌలర్లలో పార్నెల్ 4 వికెట్లు పడగొట్టగా, తాహిర్, రబడ, ప్రీటోరియస్ తలో రెండు వికెట్లు తీశారు.