తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘన విజయం
ఐపీఎల్‌లో కనబర్చిన స్ఫూర్తిదాయక ఆటతీరును చాంపియన్స్ లీగ్‌లోనూ హైదరాబాద్ జట్టు కొనసాగించింది. విజయలక్ష్యం పెద్దదే అయినా ఏ మాత్రం బెదరకుండా దూకుడు ప్రదర్శించి సీఎల్‌టి20 క్వాలిఫయింగ్‌లో శుభారంభం చేసింది. ఇటీవల తనకు వచ్చిన సూపర్‌స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టుకుంటూ శిఖర్ ధావన్ మళ్లీ చెలరేగి నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు.
మొహాలీ: చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సీఎల్‌టి20 అర్హత మ్యాచుల్లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో కందురతా మారూన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కందురతా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది.
సంగక్కర (46 బంతుల్లో 61 నాటౌట్; 7 ఫోర్లు), కెప్టెన్ తిరిమన్నె (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 89 పరుగులు జోడించి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించారు. ఇషాంత్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శిఖర్ ధావన్ (53 బంతుల్లో 71; 11 ఫోర్లు), పార్థివ్ పటేల్ (42 బంతుల్లో 52; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 121 పరుగులు జత చేసి రైజర్స్ లక్ష్యాన్ని సులభతరం చేశారు. చివర్లో పెరీరా (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో మ్యాచ్ ముగిసింది. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యం
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో గతి తప్పిన బౌలింగ్‌తో స్టెయిన్ తన రెండు ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మరో వైపు ఇషాంత్ చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. తన తొలి ఓవర్లో ఒకే పరుగు ఇచ్చిన ఇషాంత్, రెండో ఓవర్లో తరంగ (18 బంతుల్లో 19; 4 ఫోర్లు)ను పెవిలియన్‌కు పంపించాడు. మరుసటి ఓవర్లోనే స్యామీ బౌలింగ్‌లో జయసూర్య (4) వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసే సరికి కందురతా 2 వికెట్లకు 37 పరుగులు చేసింది. ఈ దశలో సంగక్కర, తిరిమన్నె కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు సమన్వయంతో చక్కటి షాట్లు ఆడుతూ వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తిరిమన్నె... ఆ వెంటనే ఇషాంత్ వేసిన యార్కర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం జోరు పెంచిన సంగక్కర 36 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివర్లో దిల్హారా (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో మారూన్స్ ఇన్నింగ్స్ 168 పరుగుల వద్ద ముగిసింది.
చెలరేగిన ఓపెనర్లు
హైదరాబాద్‌కు ధావన్, పార్థివ్ కలిసి మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ప్రతీ ఓవర్లో బౌండరీలు బాదుతూ వీరిద్దరు వేగంగా లక్ష్యం దిశగా జట్టును నడిపించారు. మెండిస్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి ధావన్ తన దూకుడును ప్రదర్శించాడు. పవర్‌ప్లేలో రైజర్స్ వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది. ఏ బౌలర్‌ను వదలని రైజర్స్ ఓపెనర్లు జోరును కొనసాగించడంతో 10.4 ఓవర్లలో జట్టు స్కోరు వంద పరుగులకు చేరుకుంది. ఆ వెంటనే ధావన్ (35 బంతుల్లో), పార్థివ్ (37 బంతుల్లో) వరుస బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కొంత వ్యవధిలో ఈ ఇద్దరూ అవుటైనా...డుమిని (6 నాటౌట్)తో కలిసి పెరీరా ముగించాడు.
స్కోరు వివరాలు
కందురతా మారూన్స్ ఇన్నింగ్స్: తరంగ (సి) పార్థివ్ (బి) ఇషాంత్ 19; జయసూర్య (సి) పార్థివ్ (బి) స్యామీ 4; సంగక్కర (నాటౌట్) 61; తిరిమన్నె (బి) ఇషాంత్ 54; దిల్హారా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 168
వికెట్ల పతనం: 1-25; 2-33; 3-122.
బౌలింగ్: స్టెయిన్ 4-0-35-0; ఇషాంత్ 4-0-20-2; స్యామీ 4-0-31-1; పెరీరా 4-0-43-0; మిశ్రా 1-0-9-0.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: పార్థివ్ (సి) జయరత్నే (బి) జయసూర్య 52; ధావన్ (సి) కులశేఖర (బి) మెండిస్ 71; డుమిని (నాటౌట్) 6; పెరీరా (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 174
వికెట్ల పతనం: 1-121; 2-136.
బౌలింగ్: జయసూర్య 4-0-25-1; జయరత్నే 3-0-33-0; నువాన్ కులశేఖర 3.3-0-35-0; దిల్హారా 4-0-38-0; అజంతా మెండిస్ 4-0-39-1.