పుజారాని ఆడించాలి | The movie Pujara | Sakshi
Sakshi News home page

పుజారాని ఆడించాలి

Published Thu, Aug 20 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

The movie Pujara

శ్రీలంకలోని పురాతనమైన వేదికల్లో పి.సారా ఓవల్ కూడా ఒకటి. సంగక్కర సొంత క్లబ్ మైదానం కూడా. అందుకే ఈ మ్యాచ్‌లో భావోద్వేగాలు ఉంటాయి. ఈ మైదానంలోనే సంగ ఎదిగాడు. కాబట్టి అతనికి ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. అద్భుతమైన కెరీర్‌ను సొంత ప్రేక్షకుల ముందు ముగించే అవకాశం ప్రతి క్రికెటర్‌కు లభించదు. నిస్సందేహంగా సంగక్కర గొప్ప ఆటగాడు. బ్యాట్స్‌మన్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు. సంగ ఫిట్‌నెస్, సామర్థ్యం, ఆటపై అతనికి ఉన్న మక్కువకు సలాం చేయాల్సిందే.

ఓ బౌలర్‌గా నేనూ సంగక్కర నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. అతనికి బౌలింగ్ చేయడం ఎప్పుడూ ఓ సవాలే. కాలంతో పాటు అతనూ పరిణతి చెందాడు. ఫలితంగా గత 2-3 ఏళ్ల నుంచి కెరీర్‌లోనే ఉత్తమ క్రికెట్ ఆడుతున్నాడు. మైదానం లోపలా, బయటా సంగక్కరది చాలా మంచి వ్యక్తిత్వం. మరో పాత్రలో అతను క్రికెట్‌కు తన సేవలందించి రుణం తీర్చుకుంటాడని భావిస్తున్నా. సంగక్కరతో పాటు అతని కుటుంబానికి నా శుభాకాంక్షలు.

 ఇక రెండో టెస్టు విషయానికొస్తే భారత జట్టు సన్నాహాకాలు అంత బాగా లేవు. తొలి టెస్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన ధావన్ గాయంతో స్వదేశానికి పయనమయ్యాడు. ఆల్‌రౌండర్ బిన్నీ లంక వెళ్లాడు. విరాట్, జట్టు మేనేజ్‌మెంట్ బిన్నీని బ్యాట్స్‌మన్‌గా పరిగణనలోకి తీసుకుంది. ఐదో బౌలర్‌గా అతన్ని ఉపయోగించుకోవాలనుకుంటే... తొలి టెస్టులో ఐదో బౌలర్ అవసరం అంతగా రాలేదు. కాబట్టి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఉంటే బాగుండేది. మిగతా బౌలర్లు అశ్విన్‌కు సరైన సహకారం అందిస్తే మరింత బాగుంటుంది. జట్టులో ఒక్కరి వ్యక్తిగత ప్రదర్శన వల్ల మ్యాచ్ గెలవలేరు. జట్టు మొత్తం సమష్టిగా రాణించి సిరీస్‌లో పుంజుకోవాలి.

మురళీ విజయ్ ఫిట్‌నెస్ పరీక్ష పాస్ కాకుంటే కచ్చితంగా పుజారాను ఆడించాలి. ఓవల్ వికెట్ చాలా కఠినంగా ఉంటుంది. ఇది లంకకు అనుకూలంగా మారుతుంది. సంగక్కర, మ్యాథ్యూస్‌లు కుదురుకుంటే భారత్‌కు కష్టాలు తప్పవు. ఇప్పుడు లంకేయులు సంగక్కర రిటైర్మెంట్, విజయం అనే రెండు అంశాలపై దృష్టి పెడతారు. కాబట్టి భారత్ కేవలం ఆటపైనే దృష్టిసారించాలి. గాలెలో మాదిరిగా ఆట ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు బిగించి మంచి ముగింపు ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement