లంకను జయించారు
సాధించారు...
మూడో టెస్టులో భారత్ ఘన విజయం
♦ 2-1తో సిరీస్ కైవసం
♦ చెలరేగిన ఇషాంత్, అశ్విన్
♦ మ్యాథ్యూస్ శతకం వృథా
వెళ్లిన ప్రతిసారి ఏదో ఓ వైఫల్యంతో వెనక్కి వచ్చేస్తున్న పరిస్థితి... జట్టులో సీనియర్లు లేరు... అనుభవమూ అంతంత మాత్రమే... కొత్త ఆశలు.. కొంగొత్త సవాళ్లతో జట్టులోకి వచ్చిన కుర్రాళ్లు... ప్రత్యర్థిదేమో.. సొంతగడ్డపై బెబ్బులిలా పోరాడే తత్వం... తొలి టెస్టు ఓటమి ప్రభావం ఓ మూలన మిణుకుమంటున్నా.... మైదానంలో పరిస్థితులు సవాళ్లుగా మారుతున్నా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో... నైపుణ్యాన్ని ఆయుధంగా మల్చుకుని లంక గడ్డపై యువ భారత్ రెచ్చిపోయింది. ప్రత్యర్థికి చుక్కలు చూపెడుతూ... తిరుగులేని ఆటతీరుతో 22 ఏళ్ల తర్వాత లంకలో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఒక విదేశీ సిరీస్‌లో తొలి టెస్టు ఓడి కూడా సిరీస్ గెలుచుకోవడం భారత్‌కు ఇదే తొలిసారి. అసలు ‘దూకుడు’ అనే మాట తమతోనే పుట్టిందా అన్నట్లు... దానికి కొత్త అర్థాన్ని చూపించాలన్నట్లు కెప్టెన్ పదే పదే తన సహచరులలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొన్ని విమర్శలు ఎదురైనా, డెరైక్టర్ రవిశాస్త్రి అండతో కోహ్లి తాను అనుకున్న వ్యూహాలకు కట్టుబడ్డాడు. ‘మూడు టెస్టుల సిరీస్ నా సత్తాకు సవాల్. ఎందుకంటే పూర్తి స్థాయి సిరీస్ ఉంటే నా వ్యూహాల్లో తప్పులు జరిగినా దిద్దుకోగలను’ అని సిరీస్‌కు ముందు కోహ్లి చెప్పా డు. తొలి టెస్టులో ఆద్యంతం ఆధిక్యం ప్రదర్శించినా, ఒకే సెషన్‌లో వెనుకబడి మ్యాచ్ కోల్పోవడం షాక్‌కు గురిచేసింది. దాంతో ఒక్కసారిగా అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే కోహ్లి నేర్చుకున్నాడు. తర్వాతి రెండు టెస్టుల్లో మ్యాచ్‌లు చేజారకుండా తాను అనుకున్న వ్యూహాలకు కట్టుబడి సిరీస్ సాధించాడు.
బౌలింగ్ అద్భుతం : సొంతగడ్డపై అమోఘమైన రికార్డు ఉన్న అశ్విన్ ఇప్పుడు దానిని లంకలో కూడా కొనసాగించాడు. స్పిన్‌లో వైవిధ్యంతో పాటు బౌన్స్‌ను కూడా చక్కగా ఉపయోగించుకొని అతను 21 వికెట్లతో సత్తా చాటాడు. నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చినా తన లెగ్‌స్పిన్‌లో పదును తగ్గలేదని నిరూపిస్తూ అమిత్ మిశ్రా సిరీస్‌లో సగటు, ఎకానమీ, స్ట్రైక్‌రేట్...ఇలా అన్నింటిలో అత్యుత్తమంగా నిలిచాడు. ఇక ఇషాంత్ బౌలింగ్ ప్రత్యర్థిని ‘తల బాదుకునేలా’ చేసింది.
గత ఏడాది లార్డ్స్ టెస్టులో అద్భుత విజయాన్ని అందించిన ఇషాంత్ మరో సారి తన పేస్ పదునుతో జట్టును టెస్టు గెలిపించాడు. ఉమేశ్ ఎక్కువ వికెట్లు తీయకపోయినా (5) లంక టాపార్డర్‌ను పూర్తిగా కట్టి పడేశాడు. మొత్తానికి కోహ్లి అనుకున్న ఐదుగురు బౌలర్ల సిద్ధాంతానికి వీరంతా న్యాయం చేశారు. 1988 తర్వాత భారత బౌలర్లు 3 టెస్టుల సిరీస్‌లో తొలిసారి అన్ని 60 వికెట్లు పడగొట్టడం విశేషం.
ఐదు శతకాలు: సిరీస్‌లో గొప్పగా కనిపించకపోయినా భారత బ్యాటింగ్ ప్రదర్శన కూడా నిలకడగా సాగింది. ప్రతీ టెస్టుకు వేర్వేరు ఓపెనింగ్ జోడీలు బరిలోకి దిగినా ఇద్దరిలో ఒకరు రాణించడం జట్టుకు కలిసొచ్చింది. ధావన్, రాహుల్, పుజారా సెంచరీలు చేయగా, రెండో టెస్టులో రహానే కూడా కీలక శతకం బాదాడు.
ముఖ్యంగా టెస్టు జట్టుకు పుజారా అవసరం ఎంత ఉందో అతను మూడో టెస్టులో స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొని చేసిన పరుగులు చూస్తే తెలుస్తుంది. కోహ్లి కూడా సెంచరీ చేసినా అతని స్థాయికి తగిన ప్రదర్శన మాత్రం రాలేదు. రోహిత్ ఎలాగోలా రెండు అర్ధ సెంచరీలు చేసినా...తనకు టెస్టుల్లో స్థానంపై వచ్చిన సందేహాలకు మాత్రం సమాధానమివ్వలేకపోయాడు.
జోరు కొనసాగాలి : గత రెండేళ్లలో జొహన్నెస్‌బర్గ్, వెల్లింగ్టన్, గాలేలలో విజయానికి చేరువగా వచ్చినా... దానికి దూరమైన భారత్ ఇప్పుడు కొలంబోలో చివరకు లక్ష్యాన్ని చేరింది. సచిన్ రిటైర్మెంట్ తర్వాత తొలి సిరీస్ నెగ్గిన యువ ఆటగాళ్లలో గెలుపు కళ కనిపిస్తోంది. అయితే ఏ రకంగా చూసిన ప్రస్తుత శ్రీలంక జట్టు చాలా బలహీనం. మనకంటే అనుభవం తక్కువ ఉన్న ఆటగాళ్లు అక్కడ చాలా మంది ఉన్నారు. ఇది మన గెలుపు రికార్డును మార్చకపోవచ్చు గానీ...రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో సత్తా చాటితే కోహ్లి సేనకు తిరుగుండదు. మన గడ్డపై కూడా సఫారీలు ఎప్పుడైనా ప్రమాదకర ప్రత్యర్థే. వారిని నిలువరించి విజయం అందుకుంటే టెస్టుల్లో మన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. -సాక్షి క్రీడా విభాగం
కొలంబో : రాబోయేది మొత్తం టెస్టుల సీజన్. ఇందులో తొలి పరీక్షలో కోహ్లిసేన శ్రీలంకలో దిగ్విజయంగా పాసయింది. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. అశ్విన్ (4/69), ఇషాంత్ (3/32) పరాక్రమం చూపెట్టడంతో మంగళవారం ముగి సిన చివరి టెస్టులో భారత్ 117 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 22 ఏళ్ల తర్వా త లంక గడ్డపై సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా.. 2011 తర్వాత విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 386 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక రెండో ఇన్నిం గ్స్‌లో 85 ఓవర్లలో 268 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మ్యాథ్యూస్ (240 బంతుల్లో 110; 13 ఫోర్లు) పోరాటానికి తోడు కుశాల్ పెరీరా (106 బంతుల్లో 70; 11 ఫోర్లు) సమయోచితంగా రాణించాడు. కానీ సహచరుల వైఫల్యం లంక జట్టుకు ఓటమిని మిగిల్చింది. పుజారాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ లభించాయి.
డ్రా వైపు మొగ్గినా: 67/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన లంకేయులపై భారత బౌలర్లు ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యారు. మ్యాథ్యూస్ నిలకడగా ఆడినా... రెండో ఎండ్‌లో కౌశల్ సిల్వ (27), తిరిమన్నే (12)లను అవుట్ చేయడంతో లంక 107 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అయితే రెండో సెషన్‌లో మ్యాథ్యూస్, కుశాల్ పెరీరాలు ఓ రేంజ్‌లో పోరాటం చేశారు. ఈ ఇద్దరి జోరుతో ఓ దశలో మ్యాచ్ డ్రా తప్పదేమో అనుకుంటున్న దశలో పెరీరా చేసిన తప్పు భారత్‌కు వరంగా మారింది. 77వ ఓవర్‌లో అశ్విన్ బంతిని అనవసరంగా రివర్స్ స్వీప్ ఆడి రోహిత్ చేతికి చిక్కాడు. ఫలితంగా ఈ ఇద్దరి మధ్య ఆరో వికెట్‌కు నెలకొన్న 135 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. 81వ ఓవర్‌లో కొత్త బంతితో ఇషాంత్ నిప్పులు చెరిగాడు. మ్యాథ్యూస్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తర్వాత అశ్విన్, మిశ్రాలు మిగతా మూడు వికెట్లు తీసి చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 312 ఆలౌట్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 201 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 274 ఆలౌట్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తరంగ (సి) ఓజా (బి) ఇషాంత్ 0; సిల్వ (సి) పుజారా (బి) ఉమేశ్ 27; కరుణరత్నే (సి) ఓజా (బి) ఉమేశ్ 0; చండిమల్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 18; మ్యాథ్యూస్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 110; తిరిమన్నే (సి) రాహుల్ (బి) అశ్విన్ 12; కుశాల్ పెరీరా (సి) రోహిత్ (బి) అశ్విన్ 70; హెరాత్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 11; కౌశల్ నాటౌట్ 1; ప్రసాద్ (సి) బిన్నీ (బి) అశ్విన్ 6; ప్రదీప్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (85 ఓవర్లలో ఆలౌట్) 268. వికెట్ల పతనం: 1-1; 2-2; 3-21; 4-74; 5-107; 6-242; 7-249; 8-257; 9-263; 10-268. బౌలింగ్: ఇషాంత్ 19- 5-32-3; ఉమేశ్ 15-3-65-2; బిన్నీ 13-3-49 -0; మిశ్రా 18-1-47-1; అశ్విన్ 20-2-69-4.
200 ఇషాంత్ శర్మ టెస్టుల్లో తీసిన వికెట్ల సంఖ్య. కపిల్ దేవ్ (434), జహీర్ (311), శ్రీనాథ్ (236) ఈ ఘనత సాధించిన ఇతర భారత పేసర్లు.
1 1993 తర్వాత లంక గడ్డపై సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. గతంలో అజహర్ నేతృత్వం లోని టీమ్ 1-0తో సిరీస్‌ను గెలిచింది.
ఇషాంత్‌పై టెస్టు నిషేధం
కొలంబో: శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో దురుసుగా ప్రవర్తించినందుకు భారత పేసర్ ఇషాంత్ శర్మపై ఐసీసీ ఓ టెస్టు నిషేధాన్ని విధించింది. దీంతో నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు తను అందుబాటులో ఉండడు. అలాగే శ్రీలంక బ్యాట్స్‌మన్ దినేశ్ చండిమాల్ కూడా ఇదే కారణంతో ఓ వన్డే మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. తనతో పాటు లాహిరు తిరిమన్నే, దమ్మిక ప్రసాద్‌ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 50 శాతం కోత విధించింది.
టెస్టును డ్రా చేసుకోవడం అనేది మాకు చివరి ప్రత్యామ్నాయం. ప్రతి మ్యాచ్‌లోనూ విజయం కోసం అవసరమైతే ఓడిపోవడమనే రిస్క్‌ను చేయడానికి వెనుకాడం. ఈ విజయం మా ఉత్సాహాన్ని పెంచింది.
-కోహ్లి