సంగ కోసం శ్రీలంక...సమం కోసం భారత్ | The second Test from today | Sakshi
Sakshi News home page

సంగ కోసం శ్రీలంక...సమం కోసం భారత్

Published Thu, Aug 20 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

సంగ కోసం శ్రీలంక...సమం కోసం భారత్

సంగ కోసం శ్రీలంక...సమం కోసం భారత్

♦ నేటినుంచి రెండో టెస్టు
♦ సంగక్కరకు ఇదే ఆఖరి మ్యాచ్
♦ ఉత్సాహంగా మ్యాథ్యూస్ సేన
♦ ఒత్తిడిలో కోహ్లి అండ్ కో
 
 క్రికెట్ ప్రపంచానికి మరో దిగ్గజం వీడ్కోలు పలుకుతున్న వేళ ఇది. దశాబ్దంన్నర కాలంగా శ్రీలంక క్రికెట్‌కు మూలస్థంభాల్లో ఒకడిగా నిలిచి అత్యుత్తమ విజయాలు అందించిన సంగ చివరి సారి మైదానంలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో గెలుపుతో అతని కెరీర్‌కు ఘనమైన ముగింపు పలకాలని సహచరులు భావిస్తున్నారు. మరో వైపు తొలి టెస్టులో అంది వచ్చిన విజయాన్ని చేజార్చుకున్న టీమిండియా తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంది. 22 ఏళ్ల తర్వాత లంక గడ్డపై సిరీస్ సొంతం చేసుకునేందుకు ఆశలు మిగిలి ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలి.
 
 కొలంబో : దూకుడుగా ఆడతారా లేక జాగ్రత్తగా ఇన్నిం గ్స్ నడిపిస్తారా...స్పిన్‌పై ఎదురు దాడి చేస్తారా లేక పేస్‌పై ప్రతాపం చూపిస్తారా... ఏమైనా చేయండి కానీ మ్యాచ్ నెగ్గాలి. రెండో టెస్టుకు ముందు భారత జట్టు ఆలోచనా తీరు ఇది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయంతో షాక్ తిన్న టీమిండియా తమ పరువు నిలబెట్టుకునేందుకు బరి లోకి దిగుతోంది. మరో వైపు సంగక్కరకు విజయంతో వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్న శ్రీలంక కూడా అదే ఉత్సాహంతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేటినుంచి (గురువారం) భారత్, శ్రీలంకల రెండో టెస్టు కోసం ఇక్కడి సారా ఓవల్ మైదానం సిద్ధమైంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా భారత్ సిరీస్ గెలుచుకునే అవకాశం కోల్పోతుంది.

 బిన్నీకి చోటుందా!
 భారత జట్టు ప్రధానంగా రెండు మార్పులతో ఆడే అవకాశం ఉంది. ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ గాయంతో సిరీస్‌కు దూరం అయ్యాడు. అయితే ఏడాదిన్నరగా అంతే జోరు చూపించిన విజయ్... గాయం నుంచి కోలుకొని మ్యాచ్‌కు సిద్ధం కావడం శుభ పరిణామం. రాహుల్‌తో కలిసి అతను ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. బుధవారం విజయ్ నెట్స్‌లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశాడు. ఎన్ని విమర్శలు వచ్చినా కెప్టెన్ కోహ్లి, శాస్త్రి తమ నమ్మకాన్ని కొనసాగిస్తూ రోహిత్‌కు మూడో స్థానంలో మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక హడావిడిగా పిలిపించిన స్టువర్ట్ బిన్నీకి తుది జట్టులో స్థానం లభించవచ్చు. సారా ఓవల్ వికెట్ పేస్‌కు కాస్త అనుకూలిస్తుంది. పైగా గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఘోర వైఫల్యం దృష్ట్యా  లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల ఆటగాడు జట్టుకు అవసరం. కాబట్టి హర్భజన్ సింగ్ స్థానంలో బిన్నీ రావచ్చు. ఇక మరో సారి అశ్విన్‌పై భారత్ ఆశలు పెట్టుకుంది.   

 ప్రదీప్ అవుట్
 మరో వైపు లంక ఓపెనర్లు కరుణరత్నే, కౌశల్ సిల్వ గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. అయితే చాన్నాళ్లుగా నిలకడగా రాణించిన వీరిద్దరిపై మేనేజ్‌మెంట్ మరోసారి నమ్మకముంచింది. ఇక తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న సంగక్కర మరో సారి తనకిష్టమైన మైదానంలో (50.29 సగటుతో 855 పరుగులు)  చిరస్మరణీయ ఆటతీరు కనబరుస్తాడా చూడాలి. పాక్‌తో సిరీస్‌లో విఫలమై ఓటమిలో భాగమైన సంగ ఈ సారి ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడి జట్టును విజేతగా నిలపాలని పట్టుదలగా ఉన్నాడు. మ్యాథ్యూస్ సహా మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. పేసర్ నువాన్ ప్రదీప్ గాయంతో మ్యాచ్‌నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో చమీరా లేదా విశ్వ చోటులోకి రావచ్చు. సారా ఓవల్ పిచ్‌ను చూస్తే లంకలో ప్రస్తుతం ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు ఉన్న చమీరాకు అవకాశం దక్కవచ్చు. ఇక గత ప్రదర్శనతో హెరాత్ జోరు మీదుండగా, కౌశల్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

 జట్లు (అంచనా)
 భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహు ల్, రోహిత్, రహానే, సాహా, హర్భజన్/బిన్నీ, అశ్విన్, ఇషాంత్, మిశ్రా, ఆరోన్.
 శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టె న్), కరుణరత్నే, సిల్వ, సంగక్కర, తిరిమన్నె, చండీమల్, ప్రసాద్, హెరాత్, కౌశల్, చమీరా/విశ్వ.
 
 ఉ. గం. 10 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 పిచ్, వాతావరణం
 శ్రీలంకలోని ఇతర మైదానాలతో పోలిస్తే సారా ఓవల్ ప్రతీసారి పేసర్లకే ఎక్కువగా అనుకూలిస్తుంది. అయితే కాస్త బౌన్స్ కూడా ఎక్కువగా ఉండి స్పిన్నర్లు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. మ్యాచ్ జరిగే అన్ని రోజులూ వర్ష సూచన ఉంది.
 
 సారా ఓవల్‌లో జరిగిన 18 టెస్టుల్లో 14 మ్యాచ్‌లలో ఫలితం వచ్చింది.
 ఇక్కడ లంకతో 2 టెస్టుల్లో ఓడి ఒకటి గెలిచిన భారత్... చివరి సారి ఆడిన మ్యాచ్‌లో ప్రత్యర్థిపై గెలుపొందింది.
 తొలి టెస్టు ఓడి భారత్ సిరీస్ గెలవడం గతంలో రెండు సార్లు (1972, 2001) మాత్రమే జరిగింది.
 గత పది టెస్టుల్లో ఇక్కడ 7 సార్లు తొలి సారి బ్యాటింగ్ చేసిన జట్టు ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement