
ఆటపై ప్రేమే పేరు తెచ్చింది!
పర్వతగిరి, న్యూస్‌లైన్: క్రికెట్‌పై తనకు ఉన్న అభిమానంతోనే ఆటలో ఎదగగలిగానని, అదే తనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఆర్‌డీఎఫ్) ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలను లక్ష్మణ్ శనివారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న సైన్స్‌ఫెయిర్, బాల మేళాలో ఆయన చిన్నారులతో ముచ్చటించారు. ఆసక్తి ఉన్న రంగంలో శ్రమిస్తే మంచి స్థాయికి చేరుకోవచ్చని ఆయన విద్యార్థులతో అన్నారు. తాను చదివిన పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం, క్రమశిక్షణ వల్లే తాను ఈ స్థాయికి చేరానని, ఆర్‌డీఎఫ్ పాఠశాలను చూస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు.
విద్యార్థి దశలో సమయపాలన పాటిస్తూ చదువుపై శ్రద్ధపెట్టి చేర్చుకుంటే భవిష్యత్‌లో మరింతగా రాణించవచ్చని చెప్పారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఆర్‌డీఎఫ్ పాఠశాల సిబ్బందిని లక్ష్మణ్ ప్రశంసించారు. చిన్న రాష్ట్రమైన జార్ఖండ్‌నుంచి వచ్చిన ఎంఎస్ ధోని ఇప్పుడు గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడని, గ్రామీణ విద్యార్థులు కూడా అతడిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఈ దిగ్గజ క్రికెటర్ మార్గదర్శనం చేశాడు.