బీసీసీఐకి భారీ దెబ్బ!
నూతన ఆదాయ పంపిణీ విధానంతో రూ. 1400 కోట్ల మేర నష్టం!
న్యూఢిల్లీ: తమ ఆర్థిక ప్రయోజనాలకు భారీగా కోత విధించే నిర్ణయం తీసుకున్నందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎలాగైనా ఈ అడ్డంకిని అధిగమించాలనే ఆలోచనలో ఉన్న బోర్డు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనుంది. భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటూ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన బోర్డుగా బీసీసీఐ పేరు తెచ్చు కుంది. అయితే తాము ఐసీసీకి ఎంత ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నా అందరితోపాటే తమకూ సమానంగా పంపిణీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. 2007 నుంచి 2015 వరకు ఐసీసీ అన్ని టెస్టు దేశాలకు సమానంగా ఆదాయాన్ని పంచేది. దీంతో బీసీసీఐ సహా అన్ని బోర్డులకు కూడా సమానంగా దాదాపు 52.5 మిలియన్ డాలర్లు (రూ.353 కోట్లు) దక్కేవి. అయితే ఈ పంపిణీని క్రికెట్ పెద్దన్నగా పరిగణించబడే బీసీసీఐ ఇష్టపడలేదు. దీంతో తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందనే కారణంతో 2014లో ఐసీసీ చైర్మన్‌గా ఉన్న ఎన్.శ్రీనివాసన్ నూతన ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చారు. దీంట్లో భాగంగానే ‘బిగ్ త్రీ’ నమూనా తెర పైకి వచ్చింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుల నుంచి అధికంగా ఆదాయం వస్తుంది కాబట్టి వారికి వాటా కూడా అదే నిష్పత్తి ప్రకారం దక్కాలనేది దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో భారత్‌కు అధికంగా 20.3 శాతం ఆదాయం దక్కాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం ఎనిమిదేళ్ల కాలానికి (2015–23) ఐసీసీ ఆదాయంలో భారత్‌కు రూ.3,400 కోట్లు దక్కుతుందని లెక్కగట్టారు. కానీ 2015లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా ఎంపికయ్యాక పరిస్థితులు తలక్రిందులయ్యాయి. ఆయన ‘బిగ్ త్రీ’ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పంపిణీ ద్వారా చిన్న దేశాలు చితికిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొత్త ఆర్థిక విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇది భారత క్రికెట్ బోర్డు ఆర్జనకు నష్టం చేకూర్చేది కావడంతోనే ప్రస్తుతం వ్యతిరేకిస్తోంది.
బీసీసీఐకి దక్కేది ఎక్కువే...
తాజాగా శనివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో నూతన ఆర్థిక విధానంపై చర్చ జరిగింది. దీనివల్ల బీసీసీఐ వాటా తగ్గినా.. ఇతర సభ్య దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. 2015–2023 వరకు సాగే ఈ కొత్త నమూనాలో ఐసీసీ నుంచి భారత బోర్డు 290 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.2,000 కోట్లు) ఆర్జించనుంది. ఇతర సభ్యదేశాలకన్నా ఇంత ఎక్కువ మొత్తం దక్కుతున్నా బీసీసీఐ ఇంకా ఎందుకు అదనంగా కోరుకుంటుందని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ వాదిస్తున్నారు.
వన్డేల్లోనూ సూపర్ ఓవర్!
ఇప్పటిదాకా టి20 క్రికెట్‌లోనే అమలవుతున్న సూపర్ ఓవర్ పద్ధతి ఇక వన్డే మ్యాచ్‌ల్లోనూ కనిపించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో దీన్ని ప్రవేశపెట్టాలని ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్లో మ్యాచ్ ‘టై’గా ముగిస్తే సూపర్ ఓవర్ వేయనున్నారు. గతంలో ఐసీసీ ఈవెంట్స్ జరిగినప్పుడు ఫైనల్లో మాత్రమే సూపర్ ఓవర్‌ను ఉపయోగించేవారు.