అదే ఉత్కంఠ | The same Suspense | Sakshi
Sakshi News home page

అదే ఉత్కంఠ

Published Sat, Sep 26 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

ఇన్నాళ్లు ఉప్పు.. నిప్పుగా ఉన్న ఎన్.శ్రీనివాసన్, శరద్ పవార్ తిరిగి మిత్రులుగా మారనున్నారా..?

బీసీసీఐ పదవిపై కొలిక్కిరాని చర్చలు
 పవార్‌కు శ్రీని మద్దతుపై ఊహాగానాలు


 న్యూఢిల్లీ : ఇన్నాళ్లు ఉప్పు.. నిప్పుగా ఉన్న ఎన్.శ్రీనివాసన్, శరద్ పవార్ తిరిగి మిత్రులుగా మారనున్నారా..? దాల్మియా మృతితో ఖాళీ అయిన బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోంది. నాగ్‌పూర్‌లో పవార్‌ను కలుసుకునేందుకు స్వయంగా శ్రీని ప్రత్యేక విమానంలో వెళ్లి రెండు గంటలకు పైగా మంతనాలు జరిపారు. తన ప్రధాన ప్రత్యర్థి, ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌పై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్న శ్రీని.. పవార్ వర్గానికి మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

దీంట్లో భాగంగానే 8 క్రికెట్ సంఘాల మద్దతు ఉన్న శ్రీని.. నాలుగు సంఘాల మద్దతు ఉన్న పవార్‌తో కలవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. బోర్డు అధ్యక్షుడిగా పవార్‌కు కానీ ఆయన నామినీకి కానీ మద్దతిస్తానని, దీనికి ప్రతిగా ఐసీసీ చైర్మన్‌గా తన పదవికి ఎలాంటి అవరోధాలు కల్పించవద్దని శ్రీనివాసన్.. పవార్‌ను కోరినట్టు ఉన్నత వర్గాల విశ్లేషణ. ఠాకూర్ వర్గానికి చెందిన రాజీవ్ శుక్లా అధ్యక్షుడైతే ఐసీసీ టాప్ పోస్టులోకి భారత్ నుంచి శ్రీనిని తప్పించి మరొకరికి అవకాశం ఇస్తారని శ్రీని ఆందోళన చెందుతున్నారు.

అయితే శుక్లా ఎన్నికకు అవసరమయ్యే మెజారిటీ వారికి లేదు. అటు తన అనునాయి అమితాబ్ చౌధురికి మద్దతు కూడగట్టుకునేందుకే పవార్‌ను శ్రీనివాసన్ కలుసుకున్నారనే వాదనా వినిపిస్తోంది. ఇదిలావుండగా శ్రీనితో దోస్తీని పవార్‌కు మద్దతుగా ఉన్న నాలుగు యూనిట్లలో కొన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ అత్యున్నత స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement