తీర్పు ఎప్పుడు వస్తుందో!
స్పష్టత ఇవ్వని ‘నాడా’
న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోప్ ఉదంతంపై విచారణ పూర్తి చేసిన నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) తీర్పు విషయంలో మాత్రం ఏటూ తేల్చడం లేదు. శని లేదా సోమవారాల్లో తీర్పు వెలువరిస్తామని చెప్పినా ఇందులోనూ స్పష్టత కరువైంది. ఈ విషయంపై నాడా, నర్సింగ్ తరఫు న్యాయవాదులను సంప్రదించినా ప్యానెల్ తీర్పు ఎప్పుడు ఇస్తుందో తమకూ తెలియదని చెప్పారు. దీంతో నర్సింగ్ రియో ఆశలు రోజు రోజుకూ సన్నగిల్లుతున్నాయి. మరోవైపు ఈ విషయంపై రెజ్లింగ్ సమాఖ్యకు కూడా ఎలాంటి సంకేతాలు అందడం లేదు.
ఒలింపిక్ విలేజ్‌కు భారత్ అథ్లెట్లు
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ కోసం ఇప్పటికే బ్రెజిల్‌కు వచ్చిన భారత అథ్లెట్లు... ఒలింపిక్ విలేజ్‌కు చేరుకుంటున్నారు. భారీ భారత బృందంలో ఇప్పటికే సగం మంది ఇక్కడికి చేరుకున్నారు. అథ్లెట్లు ముందుగా రావడం వల్ల ఇక్కడి వాతావరణానికి బాగా అలవాటుపడుతున్నారని చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా అన్నారు. ఆగస్టు 2న భారత అథ్లెట్లకు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు.