న్యూఢిల్లీ : డోపింగ్ కేసులో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ... త్వరలో రెజ్లింగ్ బరిలోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను డోపింగ్ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని కడదాకా పోరాడతానని యాదవ్ ఇది వరకే ప్రకటించాడు. కాగా నర్సింగ్ యాదవ్‌పై డోపింగ్ ఆరోపణలతో అతడిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ నాలుగేళ్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
దీంతో ఒలింపిక్స్ నుంచి అతడు చివరి నిమిషంలో వైదొలగాల్సి వచ్చింది. డోప్ పరీక్షలో విఫలమైన నర్సింగ్ యాదవ్‌కు భారత డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా).. క్రీడల అర్బిట్రేషన్ కోర్టు (కాస్)లో సవాల్ చేయగా.. విచారణలో నర్సింగ్ దోషిగా తేలాడు. మరోవైపు డోపింగ్ ఆరోపణలతో అతడిపై సీబీఐ కేసు నమోదు చేసింది.