నర్సింగ్‌పై కుట్ర జరిగింది
♦ ‘సాయ్’ అధికారిపై రెజ్లర్ అనుమానం
♦ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ వెల్లడి
♦ ‘నాడా’ క్లీన్‌చిట్ ఇస్తేనే ‘రియో’లో బరిలోకి
♦ ఇప్పటికైతే తాత్కాలిక నిషేధం
♦ డోప్‌లో దొరికిన నర్సింగ్ సహచరుడు సందీప్
న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) బాసటగా నిలబడింది. రియో ఒలింపిక్స్‌కు వెళ్లకుండా నర్సింగ్‌పై కుట్ర జరిగిందని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. డోపింగ్‌లో విఫలమైన సమాచారం అందుకున్న వెంటనే ఈనెల 19న నర్సింగ్ యాదవ్ డబ్ల్యూఎఫ్‌ఐకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడన్నారు.
హరియాణాలోని సోనెపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)లో శిక్షణ శిబిరం సందర్భంగా తాను తీసుకున్న ఆహారంలో ఉద్దేశపూర్వకంగా నిషేధిత ఉత్ప్రేరకాలు కలిపారని... ఈ కుట్ర వెనుక ‘సాయ్’ అధికారితోపాటు శిబిరంలో ఉన్న ఇతర ఆటగాళ్ల పాత్ర ఉందని నర్సింగ్ అనుమానం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ‘నెల రోజుల వ్యవధిలో నర్సింగ్‌కు మూడు డోప్ టెస్టులు నిర్వహించడం అనుమానం రేకెత్తిస్తోంది. నర్సింగ్ ప్రాక్టీస్ భాగస్వామిగా ఉన్న మరో రెజ్లర్ సందీప్ తులసీ యాదవ్ కూడా డోపింగ్‌లో పట్టుబడటం మరింత ఆశ్చర్యకరంగా ఉంది. నర్సింగ్ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దానిని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించాం. ప్రభుత్వంలోని ఇతర ముఖ్యులకు ఈ సమాచారాన్ని అందించాం. నర్సింగ్‌పై కుట్ర జరిగిన విషయాన్ని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్యతోపాటు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు వివరించాం’ అని ఆయన అన్నారు.
తుది విచారణ తర్వాతే...
రియో ఒలింపిక్స్‌లో నర్సింగ్ యాదవ్ పాల్గొంటాడా లేదా అనే విషయం ‘నాడా’ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. ‘నాడా క్లీన్‌చిట్ ఇస్తేనే నర్సింగ్‌ను రియో ఒలింపిక్స్‌కు పంపిస్తాం. ఇప్పటికైతే అతనిపై తాత్కాలిక నిషేధం విధించాం. విచారణ సందర్భంగా తన వాదన వినిపించేందుకు నర్సింగ్‌కు పూర్తి అవకాశం ఇస్తాం’ అని విజయ్ గోయల్ తెలిపారు.
మరో రెజ్లర్ కూడా...
సోనెపట్ ‘సాయ్’ కేంద్రంలో నర్సింగ్ యాదవ్‌కు ప్రాక్టీస్ భాగస్వామిగా ఉన్న సందీప్ తులసీ యాదవ్ కూడా నిషేధిత ఉత్ప్రేరకం మెథన్‌డైనోన్ వాడినట్లు తేలింది. మహారాష్ట్రకే చెందిన సందీప్ 2013లో హంగేరిలో జరిగిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 66 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
దురదృష్టకరం: సుశీల్
భారత రెజ్లింగ్‌లో డోపింగ్ వివాదం దురదృష్టకర పరిణామమని బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ వ్యాఖ్యానించాడు. ‘భారత రెజ్లింగ్‌కు ఈ దుస్థితి రావడం దురదృష్టకరం. నా కెరీర్‌లో నా సహచర రెజ్లర్లకు ఎప్పుడూ మద్దతుగా నిలిచాను. వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించాలని ఆశించాను. అయితే గత నెల రోజులుగా నేను ప్రాక్టీస్ చేయడంలేదు. రియోలో నా సహచరులు పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సుశీల్ తెలిపాడు.
‘సీబీఐ విచారణ జరిపించాలి’
డోపింగ్ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డిమాండ్ చేశాడు. రియో ఒలింపిక్స్‌కు తాను ఎంపికైన వ్యవహారం కోర్టు దాకా వెళ్లిందని, సోనెపట్ శిక్షణ కేంద్రంలో పాల్గొంటే తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో సీఐడీ నివేదిక ఇచ్చిందని అతను గుర్తు చేశాడు. ‘నాడా’ విచారణ సంఘం సభ్యులకు అన్ని వివరాలు వెల్లడిస్తానని, తనకు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని, ఇప్పటికీ తాను ఒలింపిక్స్‌లో పాల్గొంటాననే నమ్మకం ఉందని నర్సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.