అక్కా చెల్లెళ్లకు శరాఘాతం
► రెజ్లర్లు గీతా, బబితాలపై తాత్కాలిక నిషేధం
► రియో ఒలింపిక్స్ ఆశలు గల్లంతు
► ఎలాంటి సమాచారం లేకుండా బౌట్‌లకు గైర్హాజరు
న్యూఢిల్లీ: ‘ఫోగట్ సిస్టర్స్’గా పేరు తెచ్చుకున్న భారత టాప్ స్టార్ రెజ్లర్లు గీతా, బబిత కుమారిల రియో ఒలింపిక్స్ ఆశలకు అనుకోని రీతిలో కళ్లెం పడింది. ఆగస్టులో జరిగే ఈ విశ్వ క్రీడాసంరంభంలో వీరి నుంచి భారత్ పతకాలు ఆశిస్తుండగా... ఈ అక్కా చెల్లెళ్లు మాత్రం బరిలోకి దిగకుండానే అర్హత కోల్పోయారు. ఇటీవల మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ జరిగింది. దీంట్లో కాంస్య పతకాల కోసం నిర్వహించే ‘రెప్‌చేజ్’ రౌండ్‌లో తలపడాల్సిన గీత (58 కేజీలు), బబిత (53 కేజీలు) అకారణంగా ఆ బౌట్స్ నుంచి తప్పుకున్నారు. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన గీతా చైనాకు చెందిన జౌ జాంగ్టింక్‌ను ఎదుర్కోవాల్సి ఉండగా... బబిత మెక్సికో రెజ్లర్ అల్మా జేన్ వాలెన్సియాతో పోటీ పడాల్సింది.
అయితే ఈ రెప్‌చేజ్ బౌట్స్ నుంచి వీరు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వైదొలిగారు. నిర్వాహకులు ఎన్నిసార్లు ఈ ఇద్దరి పేర్లను పిలిచినా స్పందన కనిపించలేదు. ఇదంతా అక్కడే ఉన్న యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యుడబ్ల్యు) అధ్యక్షుడు నెనాడ్ లలోవిక్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వెంటనే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను పిలిచి వీరిపై చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆయన ఢిల్లీలోని డబ్ల్యుఎఫ్‌ఐ కార్యదర్శికి ఫోన్ చేసి ఇస్తాంబుల్‌లో జరిగే ఒలింపిక్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి ఈ ఇద్దరిని తప్పించాల్సిందిగా తెలిపారు. అంతేకాకుండా లక్నోలో జరిగే జాతీయ శిబిరం నుంచి కూడా వీరి పేర్లను తొలగించి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా స్పష్టం చేశారు.
అలాగే క్రమశిక్షణారాహిత్యం కింద గీత, బబితలపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలూ లేకపోలేదు. గాయం కారణంగా తప్పుకున్నా కూడా జట్టు ప్రధాన కోచ్ యూడబ్ల్యుడబ్ల్యు ప్రతినిధులకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరోవైపు ఈనెల 15లోగా యూడబ్ల్యుడబ్ల్యు ఇచ్చిన నోటీసుపై ఇద్దరు రెజ్లర్లు సమాధానం ఇవ్వాల్సి ఉందని, స్పందించకుంటే తగిన చర్య తప్పదని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) సీనియర్ అధికారి తేల్చారు.
ఇక ఇస్తాంబుల్‌లో జరిగే పోటీల్లో బబిత స్థానంలో లలితా కుమారి (53 కేజీలు), గీత స్థానంలో సాక్షి మాలిక్ (58 కేజీలు) పేర్లను డబ్ల్యుఎఫ్‌ఐ ప్రకటించింది. మరోవైపు ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలోనే రెప్‌చేజ్ బౌట్‌లో బరిలోకి దిగని ఫ్రీస్టయిల్ రెజ్లర్ సుమీత్ (125 కేజీలు)పై... శిక్షణ శిబిరానికి గైర్హాజరైన రాహుల్ అవారె (57 కేజీలు)లపై కూడా భారత రెజ్లింగ్ సమాఖ్య తాత్కాలిక నిషేధం విధించింది.