'బ్యాట్ మందం అనేది సమస్యే కాదు'
లక్నో: ఇప్పటికే క్రికెటర్లు వాడే బ్యాట్ల మందంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిన వరల్డ్ క్రికెట్ కమిటీ మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పలు మార్గదర్శకత్వాలను సూచించగా, భారత్ లో బ్యాట్లను తయారు చేసేవారు మాత్రం ఆ సూచనలతో ఏకీభవించడం లేదు. బ్యాట్ల మందంపై నిబంధనల వల్ల ఉపయోగం ఉండదు. బ్యాట్ బ్యాలెన్స్ తో పాటు, ఆటగాళ్ల టాలెంట్ ఇక్కడ ముఖ్యం' అని ఎంతోమంది స్టార్ ఆటగాళ్లకు బ్యాట్లను తయారు చేసిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీడీఎమ్ ఫ్యాక్టరీ వర్కర్ జితేందర్ సింగ్ పేర్కొన్నాడు.
క్రికెటర్ల సూచనమేరకు మందంగా ఉన్న బ్యాట్లను కానీ, పలుచని బ్లేడ్ తరహా బ్యాట్లను కానీ తాము తయారు చేస్తూ ఉంటామన్నాడు. ఆయా బ్యాట్లను బ్యాట్స్మెన్ ఎలా ఉపయోగించాలో ఆ క్రికెటర్ల నైపుణ్యంపై మాత్రమే ఆధారపడి వుంటుంది తప్ప బ్యాట్ తయారీపై కాదన్నాడు. గతనెల్లో క్రికెటర్ల వాడే బ్యాట్ల మందం పరిమితంగా ఉండాలంటూ ఎంసీసీ సూచించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లను సులువుగా కొట్టడానికి బ్యాట్ల మందం పెరగడం కూడా కారణమని ఎంసీసీ అభిప్రాయపడింది.