‘సింహ’ళ గర్జన
ఐదోసారి ఆసియాకప్ గెలిచిన శ్రీలంక
ఫైనల్లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల విజయం
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మలింగ
మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తిరిమన్నె
తుదిపోరులో మెరిసిన జయవర్ధనే
ఆసియాలో తామెంత బలమైన జట్టో శ్రీలంక మరోసారి చూపించింది. ఈ మెగా టోర్నీ ఇప్పటిదాకా 12 సార్లు జరిగితే 10 సార్లు ఫైనల్‌కు చేరిన సింహళీయులు... ఐదోసారి తమ ఖాతాలో టైటిల్ జమచేసుకున్నారు. ఈసారి టోర్నీలో అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు చేరిన లంకేయులు... తుదిపోరులోనూ గర్జించారు. పాకిస్థాన్‌ను ఐదు వికెట్లతో చిత్తు చేసి మరోసారి ఆసియా కింగ్స్‌గా అవతరించారు.
మిర్పూర్: ఆసియాకప్ లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లోనూ విఫలమైన జయవర్ధనే ఫైనల్‌కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అయినా జట్టు మాత్రం అతనిపై భరోసా ఉంచింది. ‘ఫైనల్లో జయవర్ధనే కచ్చితంగా రాణిస్తాడు’ అని కెప్టెన్ మాథ్యూస్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు మహేళ. కీలకమైన ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ (93 బంతుల్లో 75; 9 ఫోర్లు; 1 సిక్స్) ఆడాడు.
ఓపెనర్ లాహిరు తిరుమన్నె (108 బంతుల్లో 101; 13 ఫోర్లు) తన సూపర్ ఫామ్‌ను తుది సమరంలోనూ కొనసాగించాడు. ఫలితంగా శ్రీలంక ఖాతాలో ఐదోసారి ఆసియాకప్ చేరింది. షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో మాథ్యూస్ బృందం ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగులు చేసింది. మలింగ (5/56) ధాటికి 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఫవాద్ ఆలం (134 బంతుల్లో 114 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ మిస్బా (98 బంతుల్లో 65; 3 ఫోర్లు; 2 సిక్స్ లు)తో కలిసి ఫవాద్ నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు. చివర్లో ఉమర్ అక్మల్ (42 బంతుల్లో 59; 7 ఫోర్లు) వేగంగా ఆడాడు. పాక్ ఇన్నింగ్స్‌లో పడిన మొత్తం ఐదు వికెట్లూ మలింగనే తీయడం విశేషం. శ్రీలంక జట్టు 46.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 261 పరుగులు చేసి విజేతగా నిలిచింది. జయవర్ధనే, తిరిమన్నె మూడో వికెట్‌కు 156 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. కుశాల్ పెరీరా (37 బంతుల్లో 42; 6 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. మలింగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.... తిరిమన్నెకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
ఆదుకున్న ఫవాద్, మిస్బా
లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై చివరి ఓవర్లలో సంచలన బౌలింగ్‌తో లంకను గెలిపించిన మలింగ... ఈసారి ఫైనల్లో తొలి ఓవర్లలోనే చెలరేగిపోయాడు. వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి పాక్‌ను వణికించాడు. దీంతో మిస్బా సేన 18 పరుగులకే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ మిస్బా, ఫవాద్ ఆలం చక్కటి ఇన్నింగ్స్‌తో పాక్‌ను ఆదుకున్నారు. తన చివరి మూడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన మిస్బా ఈసారి బాధ్యతాయుతంగా ఆడాడు.
ఓ దశలో 10 ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఆ తర్వాత మిస్బా కాస్త జోరు పెంచి 78 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. తన రెండో స్పెల్ తొలి ఓవర్‌లోనే మిస్బాను మలింగ అవుట్ చేశాడు. మలింగ బౌలింగ్‌లోనే 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫవాద్ ఇచ్చిన క్యాచ్‌ను డి సిల్వా వదిలేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే సిక్స్‌తో ఫవాద్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో ఉమర్ అక్మల్ వేగంగా ఆడి పాక్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
అజ్మల్ దెబ్బతీసినా..
లంకకు ఓపెనర్లు కుశాల్, తిరిమన్నె శుభారంభాన్ని అందించారు. వీరిని దెబ్బ తీసేందుకు తొమ్మిదో ఓవర్‌లోనే మిస్బా స్పిన్నర్ అజ్మల్‌ను రంగంలోకి దించి ఫలితం రాబట్టాడు. జునైద్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో జోరు మీదున్న కుశాల్‌ను తన తొలి బంతికే అజ్మల్ పెవిలియన్‌కు పంపాడు. ఇక రెండో బంతికి లంకకు గట్టి షాకే తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న సంగక్కర డకౌట్ అయ్యాడు. ఈ దశలో తిరిమన్నెతో జత కలిసిన జయవర్ధనే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.
గత నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేసిన జయవర్ధనే ఫైనల్లో మాత్రం పూర్తి ఆత్మవిశ్వా సంతో ఆడాడు. 52 బంతుల్లో తిరిమన్నె అర్ధ సెంచరీ చేయగా... జయవర్ధనే 76 బంతుల్లో ఈ మార్క్‌ను చేరాడు. ఆ తర్వాత కూడా పాక్ బౌలర్లను వీరు ఆడుకున్నారు. వేగం పెంచిన జయవర్ధనే తల్హా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రియంజన్ (13) కూడా త్వరగానే అవుటయ్యాడు. సెంచరీ పూర్తయ్యాక తిరిమన్నె కూడా వెనుదిరిగాడు. కెప్టెన్ మాథ్యూస్ (16 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు
పాకిస్థాన్ ఇన్నింగ్స్: షర్జీల్ ఖాన్ (సి) తిసారా (బి) మలింగ 8; షెహజాద్ (సి) సంగక్కర (బి) మలింగ 5; హఫీజ్ (సి) సంగక్కర (బి) మలింగ 3; మిస్బా (సి) పెరీరా (బి) మలింగ 65; ఫవాద్ నాటౌట్ 114; ఉమర్ అక్మల్ (సి) ప్రియంజన్ (బి) మలింగ 59; ఆఫ్రిది నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 5) 6; మొత్తం (50 ఓవర్లలో ఐదు వికెట్లకు) 260
వికెట్ల పతనం: 1-8; 2-17; 3-18; 4-140; 5-255.
బౌలింగ్: మలింగ 10-0-56-5; లక్మల్ 10-2-41-0; సేనానాయకే 9-0-54-0; తిసారా 10-1-66-0; మాథ్యూస్ 7-1-23-0; డి సిల్వా 4-0-19-0.
శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (స్టంప్డ్) అక్మల్ (బి) అజ్మల్ 42; తిరిమన్నె (బి) అజ్మల్ 101; సంగక్కర ఎల్బీడబ్ల్యు (బి) అజ్మల్ 0; జయవర్ధనే (సి) షర్జీల్ (బి) తల్హా 75; ప్రియంజన్ (సి) అక్మల్ (బి) జునైద్ 13; మాథ్యూస్ నాటౌట్ 16; డి సిల్వా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (బైస్ 1, లెగ్ బైస్ 1, వైడ్లు 5, నోబ్ 1) 8; మొత్తం (46.2 ఓవర్లలో ఐదు వికెట్లకు) 261 వికెట్ల పతనం: 1-56; 2-56; 3-212; 4-233; 5-247.బౌలింగ్: హఫీజ్ 9-0-42-0; గుల్ 6-0-44-0; జునైద్ 9-0-56-1; అజ్మల్ 10-2-26-3; తల్హా 6.2-0-56-1; ఆఫ్రిది 6-0-35-0.
4 దాదాపు నాలుగేళ్ల తర్వాత శ్రీలంక ఒక వన్డే టోర్నమెంట్ టైటిల్‌ను సాధించింది. చివరిసారి శ్రీలంక 2010 ఆగస్టు 28న దంబుల్లాలో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో 74 పరుగులతో భారత్‌ను ఓడించి విజేతగా నిలిచింది.
9 వన్డేల్లో శ్రీలంకకిది వరుసగా తొమ్మిదో విజయం. 2004లో శ్రీలంక వరుసగా 10 విజయాలు నమోదు చేసి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
7 తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సంగక్కర ఏడోసారి ఆడిన తొలి బంతికే అవుట్ అయ్యాడు.
మా జట్టుకిది చాలా పెద్ద విజయం. గత కొంత కాలంగా బాగా ఆడి ఫైనల్స్‌కు వెళుతున్న టైటిల్స్ గెలవలేకపోతున్నాం. ఈ సారి ఆ కొరత తీరింది. మా ప్రణాళికలన్నీ సమర్థంగా అమలు చేయగలిగాం.
- మాథ్యూస్ (శ్రీలంక కెప్టెన్)