
తలపాగా మాకు అంగీకారమే: ఫిబా
వాషింగ్టన్: అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఆడే సిక్కు క్రీడాకారులకు ఊరట లభించింది. తమ సంప్రదాయక తలపాగా (టర్బన్) ధరించి ఆడటంపై ఉన్న నిషేధాన్ని అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (ఫిబా) ఎత్తివేసేందుకు నిర్ణయించింది. స్విట్జర్లాండ్‌లో గత నెల 27, 28న జరిగిన ‘ఫిబా’ సెంట్రల్ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిబంధన మార్పునకు మద్దతు ప్రకటించారు. 2014లో చైనాలో జరిగిన ఫిబా ఆసియా కప్‌లో పాల్గొన్న ఇద్దరు భారత సిక్కు ఆటగాళ్లను తలపాగా తొలగించి ఆడాల్సిందిగా రిఫరీ సూచించారు.
అలా చేయకపోతే ‘ఫిబా’ అధికారిక నిబంధనను అతిక్రమించినట్టు అవుతుందని చెప్పారు. ఆటగాళ్లు ఎలాంటి వస్తువులను ధరించి పోటీల్లో పాల్గొనకూడదని, అవి ఇతరులను గాయపరిచే అవకాశం ఉందని ‘ఫిబా’ నిబంధన సూచిస్తోంది. దీంతో అప్పటి నుంచి ఈ నిబంధనపై వ్యతిరేకత వ్యక్తమవుతుండగా ఎట్టకేలకు ‘ఫిబా’ దీన్ని మార్చేందుకు అంగీకరించినట్టయ్యింది.