అలరించిన టైగర్ వుడ్స్
న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్‌వన్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ తన అద్భుత ఆటతీరును భారత అభిమానులకు ప్రత్యక్షంగా చూపించాడు. హీరో మోటోకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజల్ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చిన వుడ్స్ ఢిల్లీ గోల్ఫ్ కోర్స్‌లో 18 హోల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. తన అతిథులతో కలిసి గోల్ఫ్ ఆడినందుకు వుడ్స్‌కు ముంజల్ రూ.15 కోట్లు చెల్లించినట్టు సమాచారం.
పూర్తి ప్రైవేట్ కార్యక్రమమే అయినప్పటికీ వుడ్స్ ఆటతీరు చూసేందుకు దాదాపు 5 వేల మంది గోల్ఫ్ కోర్సుకు తరలివచ్చారు. తొలి తొమ్మిది హోల్స్‌ను ముంజల్‌తో కలిసి ఆడిన వుడ్స్ ఆ తర్వాత రాజీవ్ సింగ్, విక్రమ్‌జిత్ సేన్, మహిళా గోల్ఫర్ షర్మిలా నికోలెట్, జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అవీక్ సర్కార్‌తో కలిసి ఆడాడు. ‘భారత్‌కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా చిన్న గోల్ఫ్ కోర్స్. భారత్ గురించి నా స్నేహితుడు అర్జున్ అత్వల్ చాలా చెప్పాడు’ అని వుడ్స్ అన్నాడు. క్రికెటర్ మురళీ కార్తీక్, మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా వుడ్స్ ఆటను చూసిన వారిలో ఉన్నారు.
వుడ్స్‌ను కలిసిన మాస్టర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మంగళవారం టైగర్ వుడ్స్‌ను కలుసుకున్నాడు. అతడు బస చేసిన హోటల్‌కు సతీసమేతంగా వెళ్లిన సచిన్ అతడితో కొద్దిసేపు గడిపాడు. ఈ విషయాన్ని వుడ్స్ ట్విట్టర్‌లో తెలిపాడు. ‘కొద్దిసేపటి క్రితమే క్రికెట్ లెజెండ్ సచిన్, అతడి కుటుంబాన్ని కలిశాను. అతడు నిజంగా చాలా కూల్. నేను భారత్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు’ అని వుడ్స్ ట్వీట్ చేశాడు.