బోణీ కొట్టేనా! | Today is Indias Second T20 Match Against South Africa | Sakshi
Sakshi News home page

బోణీ కొట్టేనా!

Published Wed, Sep 18 2019 2:15 AM | Last Updated on Wed, Sep 18 2019 8:26 AM

Today is Indias Second T20 Match Against South Africa - Sakshi

తొలి టి20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో  భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది. ఇప్పుడు మ్యాచ్‌ గెలిచిన జట్టు సిరీస్‌ కోల్పోయే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై టీమిండియా తమ అనుకూలతను వాడుకొని విజయం సాధించండంపై దృష్టి పెట్టగా, పర్యాటక జట్టు సంచలనాన్ని ఆశిస్తోంది.

కోహ్లి నాయకత్వంలో భారత ఆటగాళ్లంతా అమితోత్సాహంతో కనిపిస్తుండగా, కొత్త కెపె్టన్‌ డి కాక్‌ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం. వాతావరణం బాగుండటం అభిమానులు ఆనందించాల్సిన విషయం. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల్లో భారత్‌కు పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై బోణీ చేస్తుంది.   

మొహాలి: భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే టి20 మ్యాచ్‌లలో మొహాలీ స్టేడియంలో జరిగిన 2016 టి20 ప్రపంచ కప్‌ పోరు ఒకటి. ఆ్రస్టేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లి అత్యద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఇటీవల అతను దీని గురించే ఫొటోతో సహా గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టేడియం వేదికపై భారత్‌ మళ్లీ ఇప్పుడే బరిలోకి దిగుతోంది. కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉన్న టీమిండియా నేటి టి20 మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఒకరిద్దరు మినహా పెద్దగా గుర్తింపు లేని ఆటగాళ్లతోనే ఆడనున్న దక్షిణాఫ్రికా ఎలాంటి పోటీనివ్వగలదో చూడాలి.  

స్పిన్నర్లపై దృష్టి...
దాదాపు నెలన్నర క్రితం కోహ్లి సేన తమ చివరి టి20 మ్యాచ్‌ను వెస్టిండీస్‌తో ఆడింది. మ్యాచ్‌ గెలవడంతో పాటు 3–0తో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. నాటి మ్యాచ్‌తో పోలిస్తే సిరీస్‌కు దూరమైన భువనేశ్వర్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యా, విశ్రాంతి తీసుకున్న రోహిత్‌ శర్మ తుది జట్టులో ఖాయంగా ఉంటారు. రోహిత్‌ కోసం రాహుల్‌ను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. కోహ్లి తనదైన శైలిలో చెలరేగేందు సిద్ధంగా ఉండగా, మనీశ్‌ పాండే మరింత దూకుడుగా ఆడాల్సి ఉంది. టెస్టుల్లో ఇప్పటికే చోటు కోల్పోయిన ధావన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన స్థాయి ప్రదర్శించేందుకు ఇది సరైన అవకాశం.

ఇద్దరు పేసర్లుగా నవదీప్‌ సైనీ, దీపక్‌ చహర్‌ ఆడటం ఖాయం. అయితే అన్నింటికి మించి ఇద్దరు స్పిన్నర్లపై ప్రధానంగా అందరి దృష్టి నెలకొంది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు సాధ్యమైనన్ని ప్రత్యామ్నాయాలు పరీక్షించేందుకు సిద్ధమవుతున్న టీమిండియా ఆఫ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్, లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌లను తీర్చి దిద్దే పనిలో పడింది. రెండేళ్లుగా భారత విజయాల్లో కీలకంగా మారిన చహల్, కుల్దీప్‌లను పక్కన పెట్టి మరీ వీరిద్దరిని ఎంపిక చేశారు. కాబట్టి వారితో పోలికలు రావడం కూడా ఖాయం. ఆల్‌రౌండర్‌ జడేజా జట్టుకు అదనపు బలం. 

గెలిపించేదెవరు?  
స్టార్‌ ఆటగాళ్లతో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకే భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం శక్తికి మించి పని. అలాంటిది ఏమాత్రం అనుభవం లేని ఆటగాళ్లతో ఆ జట్టు పొట్టి ఫార్మాట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది. ఐపీఎల్‌ అనుభవం ఉన్న రబడ, మిల్లర్‌లతో పాటు కెపె్టన్‌ డి కాక్‌ ఆటపై సఫారీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా రబడ తన స్పెల్‌తో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బ తీయగలిగితే పైచేయి సాధించగలమని ఆ జట్టు భావిస్తోంది. వాన్‌ డర్‌ డసెన్‌ ఇటీవల కీలక ఆటగాడిగా ఎదిగినా... భారత్‌లో ఎప్పుడూ ఆడలేదు. బవుమా, జూనియర్‌ డాలా, నోర్టే తదితరుల గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. కొన్నాళ్ల క్రితం ఇదే మైదానంలో జరిగిన వన్డేలో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ టర్నర్‌ తరహాలో ఎవరైనా అనూహ్య ఇన్నింగ్స్‌ ఆడితే తప్ప సఫారీలకు విజయం సులువు కాబోదు.

తుది జట్లు  (అంచనా)
భారత్‌: కోహ్లి (కెపె్టన్‌), రోహిత్, ధావన్, పంత్, పాండే, హార్దిక్, జడేజా, కృనాల్, సుందర్‌/రాహుల్‌ చహర్, దీపక్‌ చహర్, సైనీ.  
దక్షిణాఫ్రికా: డి కాక్‌ (కెప్టెన్‌), రీజా హెండ్రిక్స్, బవుమా, వాన్‌ డర్‌ డసెన్, మిల్లర్, జోర్న్‌ ఫార్చూన్, ఫెలుక్‌వాయో, రబడ, షమ్సీ, ప్రిటోరియస్, డాలా/నోర్టే.  

పిచ్, వాతావరణం  
టి20లకు సరిపోయే విధంగా మంచి బ్యాటింగ్‌ వికెట్‌. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement