విరాట్ కోహ్లి
కదనోత్సాహం... ఇప్పుడు ఉన్న జోరులో ప్రపంచంలో ఏ శక్తి తమను ఆపలేదన్నంతగా అంబరాన్ని తాకుతున్న ఆత్మవిశ్వాసం... అర్ధరాత్రి మైదానంలోకి పంపినా ప్రత్యర్థిని మళ్లీ చిత్తుగా ఓడించగలమన్న ధీమా. విరాట్ కోహ్లి సేన ప్రస్తుత మానసిక స్థితి ఇది. వన్డే సిరీస్‌లో ఘన విజయంతో ఊపు మీదున్న టీమిండియా పొట్టి ఫార్మాట్‌లో కూడా తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో తమ విజయయాత్ర ప్రారంభమైన వేదికపై మరో కొత్త చరిత్రను సృష్టించేందుకు ‘సై’ అంటోంది. మరోవైపు టి20ల్లోనైనా పరువు నిలబెట్టుకోవడం దక్షిణాఫ్రికా తక్షణ కర్తవ్యం. అయితే ఆసీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో డివిలియర్స్ మినహా ప్రధాన ఆటగాళ్లందరికీ విశ్రాంతినిచ్చిన ఆ జట్టు కూడా ఈ ఫార్మాట్‌లోనూ పెద్దగా ఆశలు పెట్టుకుంటున్నట్లుగా కనిపించడం లేదు.
జొహన్నెస్‌బర్గ్: టెస్టుల్లో అద్భుత ఆటతీరు కనబర్చినా దురదృష్టవశాత్తూ సిరీస్ కోల్పోయిన భారత జట్టు వన్డేల్లో మాత్రం ఎలాంటి పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది. ఇప్పుడు టి20ల్లోనూ తమ స్థాయికి తగినట్లుగా సత్తా చాటితే సఫారీ టూర్ చిరస్మరణీయంగా నిలిచిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య వాండరర్స్ మైదానంలో తొలి టి20 మ్యాచ్ జరుగనుంది.
రైనా వచ్చాడు...
వన్డే సిరీస్ గెలిచిన జట్టునే దాదాపుగా ఇక్కడా భారత్ కొనసాగించే అవకాశం ఉంది. అయితే టి20 సిరీస్ కోసమే ముగ్గురు ఆటగాళ్లు సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, జైదేవ్ ఉనాద్కట్ దక్షిణాఫ్రికాకు వచ్చారు. వీరిలో రైనాకు మాత్రం చోటు ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు ఏడాది తర్వాత అతను భారత్ తరఫున మ్యాచ్ ఆడబోతున్నాడు. రోహిత్, ధావన్, కోహ్లిలతో టాపార్డర్ తిరుగులేని విధంగా ఉంది. వన్డేల్లో పెవిలియన్‌కే పరిమితమైన మనీశ్ పాండేకు ఈ సారైనా అవకాశం లభిస్తుందా చూడాలి. ధోని టి20 మెరుపులు చూపించి చాలా కాలమైంది. వన్డేల్లో పెద్దగా అవకాశం లభించని అతను ఫినిషర్‌గా తనకున్న గుర్తింపును మళ్లీ ప్రదర్శించాలంటే ఈ ఫార్మాట్ సరైన వేదిక. పాండ్యా కూడా బ్యాటింగ్‌లో చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్ పరంగా టీమిండియా అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. వన్డేల్లో సఫారీల పని పట్టిన నలుగురు మళ్లీ అదే తరహాలో ప్రత్యర్థిని చుట్టేయగల సమర్థులు. పేస్‌లో భువనేశ్వర్, బుమ్రా... స్పిన్‌లో చహల్, కుల్దీప్‌ల మంత్రం మళ్లీ పని చేస్తే ఈ సిరీస్ కూడా మన ఖాతాలో చేరుతుంది.
‘ఏబీ’పైనే భారం...
వన్డేల్లో కుదేలైన దక్షిణాఫ్రికా మరో పెను సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. భారత్‌తో పోలిస్తే పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఎక్కువ మందితోనే ఆ జట్టు బరిలోకి దిగుతోంది. సఫారీ విజయావకాశాలన్నీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పైనే ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడు వన్డేల్లో తన స్థాయిలో ఆడలేకపోయిన ఏబీ ఇప్పుడైనా చెలరేగడం అవసరం. కెప్టెన్ డుమిని, మిల్లర్‌లు సీనియర్లే అయినా వన్డేల్లో వైఫల్యం, స్పిన్నర్లను ఎదుర్కోలేని బలహీనత చూస్తే వీరిద్దరి నుంచి కూడా పెద్దగా ఆశించడానికి లేదు. మిగతా ఆటగాళ్లంతా దాదాపుగా కొత్తవారి కిందే లెక్క. తొలి టి20లో ముగ్గురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. ఆ జట్టు ఓపెనర్లలో హెన్‌డ్రిక్స్ 9 మ్యాచ్‌లే ఆడగా, స్మట్స్‌కు 6 మ్యాచ్‌ల అనుభవం మాతమ్రే ఉంది. ఈ సమీకరణాల నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో సఫారీలు ఏమాత్రం పోటీనిస్తారో చూడాలి.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రైనా, మనీశ్ పాండే/ దినేశ్ కార్తీక్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
దక్షిణాఫ్రికా: డుమిని (కెప్టెన్), హెన్‌డ్రిక్స్, జాన్ స్మట్స్, డివిలియర్స్, మిల్లర్/ బెహర్దీన్, క్లాసెన్, మోరిస్/జోంకర్, ఫెలుక్‌వాయో, జూనియర్ డాలా, డేన్ ప్యాటర్సన్, ఫాంగిసో.
పిచ్, వాతావరణం
వాండరర్స్ మైదానంలో మూడో టెస్టు గెలిచిన భారత్, వర్షం బారిన పడిన నాలుగో వన్డేలో ఓడింది. అయితే తాజా పిచ్ కూడా వన్డే మ్యాచ్ తరహాలోనే ఉంది. బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్, వేగవంత మైన అవుట్ ఫీల్డ్ కూడా కావడంతో పరుగుల వరద పారవచ్చు. మ్యాచ్ రోజు వర్షసూచన ఉన్నా అడ్డంకి కాబోదు.
► 6 టి20ల్లో దక్షిణాఫ్రికాపై 6 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 2 మాత్రమే ఓడింది.
► రెండు వేల పరుగుల మైలురాయికి కోహ్లి చేయాల్సిన పరుగులు 43
► వాండరర్స్‌లోనే 2006లో తమ తొలి టి20 మ్యాచ్ ఆడి నెగ్గిన భారత్... ఏడాది తర్వాత ఇక్కడే ఫైనల్ గెలిచి తొలి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.
► సా. గం. 6 నుంచి సోనీ టెన్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment