న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు సీనియర్ డిఫెండర్, మాజీ కెప్టెన్ సునీతా లక్రా అంతర్జాతీయ కెరీర్ గుడ్ బై చెప్పేశారు. మోకాలి గాయం కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్న లక్రా.. ఇక ఆడలేనంటూ వీడ్కోలు ప్రకటించారు. ఒకవైపు మనసు ఆడాలని తపిస్తున్నా గాయం వేధిస్తూ ఉండటంతో ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించక తప్పడం లేదని పేర్కొంది. ఈ ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలనుకున్నానని, అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్న తరణంలో అర్థాంతరంగా వీడ్కోలు చెప్పడం కలిచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఈ రోజు నాకు చాలా భావోద్వేగమైన రోజు. అంతర్జాతీయ హాకీకి ముగింపు పలుకుతున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో ఆడాలని భావించా. అందుకోసం సన్నద్ధం కూడా అవుతున్నా. నా మోకాలికి మరొకసారి సర్జరీ అవసరం అవుతుంది. దాంతో అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకోక తప్పడం లేదు. ఒకవైపు గాయం వేధిస్తోంది. మరొకవైపు ఆటకు గుడ్ బై చెప్పడంతో మనసు బాధిస్తోంది’ అని సునీతా లక్రా తెలిపారు. కాగా, గాయం నయమైన తర్వాత దేశవాళీ టోర్నీలు ఆడతానని పేర్కొన్నారు. దాంతో పాటు తన కెరీర్‌లో ఎదగడానికి దోహదం చేసిన నాల్కో తరఫున కూడా ఆడతానంటూ ప్రకటించారు. 2008 నుంచి భారత్‌కు లక్రా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. 2018లో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు ఆమె కెప్టెన్‌గా వ్యవహరించింది. 2018లో ఆసియా గేమ్స్‌లో లక్రా నేతృత్వంలో భారత మహిళల హాకీ జట్టు సిల్వర్ మెడల్ గెలిచింది. భారత్ తరఫున కెరీర్‌లో మొత్తం 139 మ్యాచ్‌లను లక్రా ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment