కొత్త చాంపియన్ ఎవరో?
గోవాతో చెన్నైయిన్ ‘ఢీ’
నేడు ఐఎస్‌ఎల్-2 ఫైనల్
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
ఫటోర్డా: దాదాపు 80 రోజులుగా సాగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్ ముగింపు దశకు చేరింది. ఎఫ్‌సీ గోవా, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య నేడు (ఆదివారం) టైటిల్ పోరు జరుగుతుంది. ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. దీంతో ఏ జట్టు గెలిచినా ఐఎస్‌ఎల్‌లో కొత్త చాంపియన్ అవతరించినట్టే. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన అట్లెటికో డి కోల్‌కతా సెమీస్ వరకు చేరినా సగటు గోల్స్ తేడాతో చెన్నైయిన్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఇక సుదీర్ఘంగా సాగిన ఈ లీగ్‌లో ఇప్పటిదాకా 77 రోజుల్లో 60 మ్యాచ్‌లు జరిగాయి.
ఇందులో 181 గోల్స్ నమోదు కావడం విశేషం. రెండు సీజన్లలో కలిపి గోవా, చెన్నైయిన్ మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా రెండు జట్లూ 2-2తో సమఉజ్జీగా ఉన్నాయి. ఈ సీజన్‌లోనూ చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో గోవా గెలవగా... గోవాలో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్ నెగ్గింది. ఈ నేపథ్యంలో ఈసారైనా తమ సొంత వేదికపై కీలక పోరులో నెగ్గి టైటిల్ సాధించాలనే కసితో గోవా ఉంది. అలాగే క్రితం సారి జోరునే చూపి ఆధిక్యం ప్రదర్శించాలని చెన్నైయిన్ భావిస్తోంది. బలాబలాల పరంగా గమనిస్తే ఈ రెండూ సమ ఉజ్జీలుగానే ఉన్నాయి. గోవా దూకుడును నమ్ముకుంటే చెన్నైయిన్ ఉత్తమ డిఫెన్స్‌ను కలిగి ఉంది.
బ్రెజిల్ దిగ్గజం జికో శిక్షణలో రాటు దేలిన గోవా ప్రారంభం నుంచే ఊహించని రీతిలో ఆడి తుది పోరుకు చేరుకుంది. రాఫెల్ కొయెల్హో ఫిట్‌గా ఉండడం వీరికి అదనపు బలం. ఇక రినాల్డో ఇప్పటికే ఏడు గోల్స్‌తో అదరగొట్టడంతో పాటు నాలుగు గోల్స్ చేసేందుకు సహాయపడ్డాడు. అయితే అతను వంద శాతం ఫిట్‌గా లేకపోయినా ఫైనల్‌లో కొద్దిసేపైనా ఆడతాడని కోచ్ చెబుతున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో లియో మౌరా బంతిని తన అదుపులో ఉంచుకోవడంతో పాటు సహచరులకు చక్కటి పాస్‌లు అందిస్తూ ఉపయోగపడుతున్నాడు. ప్రారంభంలో అంతగా ఆకట్టుకోని చెన్నైయిన్ ఎఫ్‌సీ లీగ్ జరుగుతున్న కొద్దీ అనూహ్యంగా పుంజుకుంది. అపౌలా ఈడెల్ రూపంలో వీరికి అత్యుత్తమ గోల్‌కీపర్ ఉన్నాడు.
గోవాపై అతను ఆడిన మ్యాచ్‌ల్లో వారికి ఒక్క గోల్ కూడా చేసే అవకాశం ఇవ్వలేదు. వీరి డిఫెండర్లంతా పొడగరులే కావడం కూడా కలిసొచ్చింది. దీంతో ఈ సీజన్‌లో చెన్నైయిన్ ప్రత్యర్థులకు అతి తక్కువగా 17 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. మెండోజా సూపర్ ఫామ్ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టనుంది. అయితే మిడ్ ఫీల్డర్ రాఫెల్ ఆగస్టో గాయం జట్టును ఆందోళన పరుస్తోంది. స్టార్ స్ట్రయికర్ ఎలనో ఫామ్ కనబరచడం లేదు. కోచ్ మెటరాజ్జి తమ జట్టు కూర్పును ఎలా రూపొందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదిఏమైనా ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్ పోటాపోటీగా సాగి అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
ధోని, కోహ్లి రాక: నేటి ఫైనల్‌ను వీక్షించేందుకు సెలబ్రిటీలు గోవాకు రానున్నారు. వీరిలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీతో పాటు చెన్నైయిన్ సహ యజమాని, క్రికెటర్ ఎంఎస్ ధోని, గోవా సహ యజమాని, క్రికెటర్ విరాట్ కోహ్లి హాజరై తమ జట్లకు మద్దతునివ్వనున్నారు. అలాగే బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ కూడా రానున్నారు.